దేశంలో పార్టీల మాదిరిగానే మీడియా సైతం విడిపోయింది. తమకు అనుకూలంగా ఉంటూ తమ ప్రయోజనాలకు పెద్ద పీట వేసేవారికే మీడియా సంస్థలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను ఎత్తి చూపిస్తూ ప్రజల కోసం పని చేయాల్సిన మీడియా ఇప్పుడు ఇప్పుడు స్వప్రయోజనాల కోసం పని చేస్తుంది. ఫోర్త్ ఎస్టేట్‌గా పిలవబడిన మీడియా, పాత్రికేయం ఇప్పుడు పార్టీల అడుగులకు మడుగొలొత్తుతూ పని చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు సైతం తమ అనుకూల మీడియాతో తమ వ్యతిరేకులపై బురద చల్లడం చేస్తున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు తమకు వ్యతిరేకంగా, ద్వేషించే మీడియాను బహిష్కరిస్తున్నారు.
ఇప్పుడు ఇదే బాటలో I.N.D.I.A కూటమి నడుస్తోంది. తమ కూటమిపై విషం చిమ్ముతున్నారంటూ కొన్ని మీడియా ఛానెళ్లను, టీవీ షోలను నిషేధించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు తమకు వ్యతిరేకంగా షోలు, డిబేట్లు పెడుతున్న యాంకర్ల జాబితాలను కూటమి సిద్ధం చేసే పనిలో ఉంది. గురువారం కోఆర్డినేషన్ కమిటీలోని సబ్ గ్రూప్ I.N.D.I.A కూటమికి వ్యతిరేకంగా పనిచేసే యాంకర్లు షోల పేర్లను రూపొందిస్తుందని తెలిపింది. త్వరలోనే ఛానెళ్లు, షో ల పేర్లు వెల్లడించనుంది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఇంట్లో జరిగిన భారత సమన్వయ కమిటీ తొలి సమావేశంలో నిషేధించాల్సిన యాంకర్లు, షోల జాబితాపై నిర్ణయం తీసుకున్నారు. మీడియాలోని ఒక విభాగం శత్రుత్వానికి పాల్పడుతోందని ప్రతిపక్షం పదే పదే ఆరోపించింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా, మీడియాలోని ఒక వర్గం తమకు తక్కువ కవరేజీ ఇస్తోందని, కావాలనే తమపై బురద చల్లుతోందని కాంగ్రెస్ ఆరోపించింది.
రాహుల్ గాంధీ భారత్ జోడా యాత్రకు ప్రజల మద్దతు లభించిందని, సోషల్ మీడియాలో సైతం విపరీతమైన స్పందన వచ్చిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. కానీ ప్రధాన మీడియా బీజేపీ నేతలకు వత్తాసు పలుకుతూ, మరికొన్ని మీడియా సంస్థలు మోదీ, బీజేపీ బెదిరింపులకు భయపడి జోడో యాత్రకు తగిన ప్రచారం ఇవ్వడం లేదన్నారు. ఈ నేపథ్యంలో కూటమికి వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా భజన చేసే మీడియాను నిషేధించాలని నాయకులు సూచించారని చెప్పారు. రాహుల్ భారత్ జోడో యాత్రకు అన్ని వర్గాల నుంచి భారీ స్పందన వచ్చిందని, అయితే మీడియా చానెళ్ల ఎడిటర్లు కావాలనే యాత్రను కవర్ చేయకుండా బహిష్కరించారని అశోక్ గెహ్లాట్ ఆరోపించారు.
లక్షల మంది ప్రచారంలో పాల్గొంటున్నా, ప్రజల నుంచి భారీ స్పందన వస్తున్నా మీడియా చూపించడం లేదన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ ఇలాగే మీడియాను బహిష్కరించింది. మే 2019లో ఒక నెలపాటు టెలివిజన్ షోలను బహిష్కరించింది. తాజాగా ఒక నెలపాటు టెలివిజన్ చర్చలకు అధికార ప్రతినిధులను పంపకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. ‘అన్ని మీడియా ఛానెల్‌లు/ఎడిటర్‌లు తమ షోలలో కాంగ్రెస్ ప్రతినిధులను ఉంచొద్దని అభ్యర్థిస్తున్నాం’ అని పార్టీ సీనియర్ నాయకుడు రణదీప్ సూర్జేవాలా ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపకాల ప్రక్రియను కూడా ప్రారంభించాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది.