గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేయడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. శనివారం మధ్యాహ్నం గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌కు విజయ్ రూపానీ తన రాజీనామా లేఖను పంపారు. 


విజయ్ రూపానీ రాజీనామాతో బీజేపీ నేతలు పలువురు సీఎం రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు, నవసరి ఎంపీ సీఆర్ పాటిల్, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్‌, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సహా మరికొందరు కీలక నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. బీజేపీ మెజార్టీ ఎమ్మెల్యేల నిర్ణయం తీసుకుని, తదుపరి సీఎంను ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో గుజరాత్ సీఎం రేసులో తన పేరు చర్చకు రావడంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ స్పందించారు. తాను సీఎం పదవిని కోరుకోవడం లేదని చెప్పారు.


Also Read: గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా.. అదే కారణమా?






గుజరాత్ సీఎం రేసులో తాను లేనని బీజేపీ ఎంపీ సీఆర్ పాటిల్ క్లారిటీ ఇచ్చారు. తనతో పాటు మరికొందరు కీలక నేతల పేర్లు సీఎం రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతుందని.. అయితే తాను సీఎం రేసులో లేనని చెప్పారు. వీడియో ద్వారా సందేశాన్ని అందించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 182 సీట్లకు 182 సీట్లు నెగ్గడంపై బీజేపీ ఫోకస్ చేస్తోందన్నారు. మాజీ సీఎం విజయ్ రూపానీతో కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేస్తానని పాటిల్ స్పష్టం చేశారు. 


Also Read: ప్రాజెక్టులపై జగన్ మౌనం ద్రోహమే.. సీమ ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై టీడీపీ సదస్సులో కీలక తీర్మానాలు


విజయ్ రూపానీ 2016 నుంచి గుజరాత్ సీఎంగా ఉన్నారు. అంతకుముందు సీఎంగా ఉన్న ఆనందీబెన్ పటేల్ రాజీనామా అనంతరం బీజేపీ అధిష్టానం రూపానీకి అవకాశం ఇచ్చింది. నేడు సీఎం పదవికి రాజీనామా చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా అనంతరం మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం ఇచ్చిన బీజేపీ అధిష్ఠానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్విర్తించానని చెప్పారు.