Independence Day 2025: భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ఇది త్యాగం, పోరాటం, ఐక్యతకు చిహ్నం. ఇది మనకు స్వేచ్ఛా, సార్వభౌమత్వాన్ని అందించింది. ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ రోజు ప్రతి సంవత్సరం మనకు బ్రిటిష్ పాలన ముగింపును గుర్తు చేస్తూ స్వేచ్ఛావాయువు పీల్చుకున్నందుకు గుర్తుగా జెండాను ఎగరేస్తాం. స్వాతంత్య్రం గౌరవించడం మన బాధ్యత అని ఈ వేడుక తెలియజేస్తుంది. 2025 స్వాతంత్ర్య దినోత్సవం కూడా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఈసారి ప్రధాని మోదీ 12వ సారి ఎర్రకోట బురుజుపై జెండాను ఎగురవేస్తారు. దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎర్రకోటపై జెండాను ఎగురవేసే విషయంలో ప్రధాని మోదీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ కంటే ఇంకా ఎంత వెనుకబడి ఉన్నారో తెలుసుకుందాం. 

ప్రధాని మోదీ 12వసారి జెండాను ఎగురవేస్తారు

ప్రధాని మోదీ ఎర్రకోట బురుజు నుంచి తన ప్రసంగంలో ప్రభుత్వ ఎజెండాను ప్రజల ముందు ఉంచుతారు. తన ప్రభుత్వం పని తీరును ప్రజలకు తెలియజేస్తారు. భవిష్యత్‌లో చేపట్టే పనులు గురించి కూడా వివరిస్తారు.  ముఖ్యమైన విధానాలు, కార్యక్రమాలను ప్రకటిస్తారు. దీనితోపాటు, అతను దేశంలోని కీలక సమస్యల గురించి కూడా మాట్లాడుతారు. గత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ప్రధాని మోదీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను అధిగమిస్తూ ఎర్రకోటపై 11వ సారి జెండాను ఎగురవేశారు. ఈసారి ఆయన 12వ సారి జెండాను ఎగురవేస్తారు. 

నెహ్రూ, ఇందిరా గాంధీ ఎన్నిసార్లు ఈ గౌరవం పొందారు?

ఈ విషయంలో ప్రధాని మోదీ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ , ఇందిరా గాంధీ తర్వాత మూడో స్థానానికి చేరుకున్నారు. ఎర్రకోట నుంచి అత్యధిక సార్లు జెండాను ఎగురవేసిన వారి జాబితాలో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన తన హయాంలో మొత్తం 17 సార్లు ఎర్రకోట బురుజుపై జెండాను ఎగురవేశారు. అదే సమయంలో, రెండో స్థానంలో ఆయన కుమార్తె , మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరు ఉంది. ఆమె 16 సార్లు జెండాను ఎగురవేసిన రికార్డును కలిగి ఉన్నారు. 

మన్మోహన్ సింగ్ ఎన్నో స్థానంలో ఉన్నారు?

యూపీఏ ప్రభుత్వంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ విషయంలో నాల్గో స్థానంలో ఉన్నారు. ఆయన 10 సార్లు ఎర్రకోట నుంచి జెండాను ఎగురవేశారు. జెండాను ఎగురవేసిన వారిలో ఐదో స్థానంలో అటల్ బిహారీ వాజ్‌పేయి, ఆరో స్థానంలో పి.వి. నరసింహారావు,  రాజీవ్ గాంధీ ఉన్నారు, వీరు ఆగస్టు 15న జెండాను ఎగురవేస్తూ ప్రసంగించారు.  

ఏ ప్రధానమంత్రి ఎన్నిసార్లు ఎర్రకోటపై జెండా ఎగరవేశారో ఇక్కడ చూద్దాం. 

ప్రధానమంత్రి పేరు  ఎన్నిసార్లు ఎర్రకోటపై జెండా ఎగరవేశారంటే? ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేసిన సంవత్సరాలు 
జవహర్‌లాల్ నెహ్రూ     17 సార్లు     1947-1964
ఇందిరా గాంధీ    16 సార్లు   1966-1977, 1980-1984
నరేంద్ర మోదీ     12 సార్లు   2014-2025
మన్మోహన్ సింగ్‌    10 సార్లు   2004-2014
అటల్‌బిహారీ వాజ్‌పేయీ    6 సార్లు   1998-2003
పీవీ నర్సింహారావు    5 సార్లు    1991-1995
రాజీవ్‌ గాంధీ    5 సార్లు    1985-1989
లాల్‌ బహదుర్‌ శాస్త్రి   2 సార్లు   1964-1965
మురార్జీ దేశాయ్‌    2 సార్లు    1977-1978
చరణ్‌ సింగ్‌  1 సార్లు   1979
వీపీ సింగ్‌  1 సార్లు    1990
హెచ్‌డీ దేవెగౌడ    1 సార్లు   1996
ఐకే గుజ్రాల్‌   1 సార్లు   1997