Pakistan Funds: జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్‌ను ఎన్ని విధాలుగా ఇరుకున పెట్టాలో అన్ని విధాలుగా బుక్ చేసేందుకు  భారత్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్‌ వివిధ ప్రపంచ ఆర్థిక సంస్థల వద్ద చేయి చాస్తోంది. లేకుంటే ఆ దేశంలో రోజు వారి కార్యక్రమాలు జరిగే పరిస్థితి లేదు. అందుకే అన్ని వైపుల నుంచి పాకిస్థాన్‌ను అష్టదిగ్బంధం చేసేందుకు ప్లాన్ రెడీ చేసింది భారత్. 

పాకిస్తాన్‌కు అందించే నిధులను సమీక్షించి, వాటిని తగ్గించే అవకాశంపై భారత ప్రభుత్వం ప్రపంచంలోని అనేక ప్రముఖ ఆర్థిక సంస్థలతో చర్చలు జరపడానికి సిద్ధమవుతోంది. బిజినెస్ టుడే తన నివేదికలో ఒక ఉన్నతాధికారిని ఉటంకిస్తూ... భారతదేశం త్వరలోనే అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF), ప్రపంచ బ్యాంక్‌, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB)తో చర్చలు జరపబోతోంది. పాకిస్తాన్‌కు అందించే ఆర్థిక సహాయంపై పునరాలోచన చేయాలని కోరుతుందని తెలిపింది. 

ఉగ్రవాదంపై ఆందోళనలో భారత్ అధికారి ఇంకా ఏమన్నారంటే... సరిహద్దు దాటి ఉగ్రవాదం ఆగడం లేదు, పాకిస్తాన్‌కు నిరంతరాయంగా అందుతున్న నిధులపై భారతదేశం ఆందోళన చెందుతోంది. ఇటీవల పహల్గాంలో జరిగిన ఘటన తరువాత భారతదేశం తన దౌత్య ప్రయత్నాల్లో మార్పులు తీసుకురావాలని కోరుకుంటోందని ఇది తెలియజేస్తుంది.

ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్‌కు IMF బెయిల్‌అవుట్ ప్రోగ్రామ్ ద్వారా 37 నెలల కాలంలో 7 బిలియన్ డాలర్ల రుణం లభించనుంది. తద్వారా ఆదాయంలో మెరుగుదల, రాష్ట్ర లోటును తగ్గించి, ఇక్కడి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో కొంత సహాయం చేయవచ్చు.

సెప్టెంబర్ 2024లో పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 7 బిలియన్ అమెరికన్ డాలర్ల రుణానికి అనుమతి లభించింది. 1958 నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ IMF ముందు 24 సార్లు చేతులు చాచింది. 

నిధులు ఎక్కడకు వెళ్తున్నాయి?పాకిస్తాన్ తరపున నుంచి పదే పదే ఉగ్రవాదదాడులు జరుగుతున్న వేళ భారతదేశం దాని విశ్వాసం, పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తవచ్చు. ఈ నిధులను పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడానికి, ఆయుధాలు కొనుగోలు చేయడానికి, LOCలో చొరబడటానికి ఉపయోగిస్తుందా అని అనుమానం వ్యక్తం చేస్తోంది.  

నివేదికల ప్రకారం ఆసియా అభివృద్ధి బ్యాంక్ పాకిస్తాన్‌కు 43.4 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. ప్రపంచ బ్యాంక్ కూడా పాకిస్తాన్‌లో జరుగుతున్న 365 ప్రాజెక్టులకు 49.7 బిలియన్ డాలర్లను కేటాయించింది, ఇందులో జనవరి 2025లో 20 బిలియన్ డాలర్ల ఒప్పందం కూడా ఉంది.

IMF కూడా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాల చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో జరుగుతున్న 7 బిలియన్ డాలర్ల ఒప్పందం కూడా ఉంది. ఈ సహాయం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమైనది. 

వివిధ సంస్థలు ఇచ్చే నిధులను సక్రమంగా దేశాభివృద్ధికి కాకుండా భారత్‌ను ఇబ్బంది పెట్టేందుకే వాడుకోందని ప్రపంచ ఆర్థిక సంస్థలకు భారత్ వివరించబోతోంది. ఇది విజయవంతమై పాకిస్థాన్‌కు ఆర్థిక సాయం అందకుంటే మాత్రం ఆ దేశంలో విపత్కార పరిణామాలు చూడొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే భారత్ తీసుకున్న చర్యలతో పాకిస్థాన్ గింగిరాలు తిరుగుతోంది. ఏం చేయాలో అర్థం కాక ప్రపంచ దేశాలవైపు సాయం కోసం ఎదురు చూస్తోంది. ఎప్పుడు భారత్ దాడి చేస్తుందో అన్న భయంతో నిద్రలేని రాత్రుళ్లు గడుపుతోంది.