ASI Report On Gyanvapi: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని జ్ఞాన్‌వాపి (Gyanvapi) మసీదు సముదాయంలో పెద్ద హిందూ దేవాలయ నిర్మాణం ఉందని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India) గురువారం రిపోర్టు ఇచ్చింది. ఈ కేసులో హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ (Vishnu Shankar Jain) గురువారం (జనవరి 25) విలేకరుల సమావేశంలో  సర్వేను చదివి వినిపించారు. 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చి మసీదును కట్టారని పురావస్తు శాఖ తేల్చిందన్నారు. ఆ మసీదు కింద ఓ నిర్మాణం ఉన్నట్లుగా గుర్తించామని, హిందూ ఆలయంలోని కొన్ని స్తంభాలను చెక్కి మసీదు నిర్మాణంలో వాడినట్లుగా గుర్తించినట్లు వెల్లడించారు.


జ్ఞానవాపి మసీదు కింది భాగంలో కొన్ని దేవతల విగ్రహాలు ఉన్నాయని విష్ణు శంకర్ జైన్ పేర్కొన్నారు. ప్రస్తుత సర్వేలో మొత్తం 34 శాసనాలు నమోదు చేయబడ్డాయని, అందులో 32 హిందూ శాసనాలను సైతం గుర్తించామని, దేవనాగరి, తెలుగు, కన్నడ భాషల్లో శాషనాలు ఉన్నట్లు విష్ణు జైన్ సర్వేను చదువుతూ చెప్పారు. మసీదు లోపల కనుగొన్నవస్తువులన్నీ డాక్యుమెంట్ చేయబడ్డాయని అన్నారు. అంతకు ముందు బుధవారం (జనవరి 24), వారణాసి జిల్లా కోర్టు ఏఎస్‌ఐ నివేదికను హిందూ, ముస్లిం పక్షాలకు అందుబాటులో ఉంచడానికి అంగీకరించింది.


ఏఎస్‌ఐ సర్వేను ఎలా నిర్వహించింది?
జ్ఞాన్‌వాపి మసీదు ఉన్న ప్రాంతంలో 2,150.5 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇనుప కంచె వేయబడి శాస్త్రీయ సర్వే నిర్వహించారు. అయితే మసీదు సముదాయంలోని 'వజుఖానా కొలను'ను సర్వే నుంచి మినహాయించారు. 2022 మేలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వజుఖానాను మూసివేశారు.


ముస్లింలు నమాజ్ చేయడానికి ముందు వజుఖానా కొలనులో పవిత్ర స్నానాలు చేసేవారు. అక్కడ లింగం ఆకారంలో నిర్మాణం బయటపడడంతో అది శివలింగమని హిందువులు వాదించారు. ముస్లింలు దానిని వాటర్ ఫౌంటేన్ అని వాదించారు. దీంతో అక్కడ పెద్ద వివాదం నడిచింది. ఈ నేపథ్యంలో మే 16, 2022లో వజుఖానా కొలనును మూసివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.   


ముస్లిం, హిందూ పక్షాల నుంచి మరో సారి పిటిషన్లు రావడంతో 'వజుఖానా'ను తెరవాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. అందులోని నీరు, చనిపోయిన చేపలను తొలగించి శుభ్రం చేయాలని ఆదేశించింది. జనవరి 20న వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో శుభ్రత పనులు పూర్తయ్యాయి.


'వజుఖానా' మినహా అక్కడ దొరికిన శాసనాలు, శిల్పాలు, నాణేలు, నిర్మాణ శకలాలు, కుండలు, టెర్రకోట వస్తువులు, రాయి, లోహం, గాజులపై ఏఎస్‌ఐ శాస్త్రీయ సర్వే నిర్వహించింది. వాటన్నింటిని పరిశీలించిన తర్వాత, అన్ని వస్తువులను సురక్షితంగా వారణాసి జిల్లా యంత్రాంగానికి అప్పగించారు. జ్ఞాన్‌వాపీ మసీదు శాస్త్రీయ సర్వే ప్రక్రియ సమయంలో, ప్రస్తుత నిర్మాణానికి ఎటువంటి నష్టం లేకుండా ఏఎస్‌ఐ సర్వే చేపట్టింది.


ఎందుకు సర్వే చేశారు?
జ్ఞానవాపి మసీదు స్థానంలో హిందూ ఆలయం ఉండేదని హిందువులు ఆరోపించారు. 17 శతాబ్ధంలో ఆలయం కూల్చి వేసి మసీదు నిర్మించారని హిందువులు కోర్టును ఆశ్రయించారు. దీంతో 2023 జులైలో దీనిపై ‘వివరణాత్మక శాస్త్రీయ సర్వే’ నిర్వహించాలని వారణాసి కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే  ఏఎస్ఐ సర్వే నిర్వహించింది.