Abolish Practice Of Male Devotees Removing Upper Attire | తిరువనంతపురం: కొన్ని ఆలయాలలో డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే దైవ దర్శనానికి భక్తులను అనుమతించరని తెలిసిందే. తిరుమలలోనూ సాంప్రదాయ దుస్తులు ధరించి దర్శనానికి రావాలని నిబంధనలు పెట్టారు. పలు ఆలయాల్లో పురుషులు అయితే పంచె కట్టులో, పైన షర్ట్ లాంటివి లేకుండా దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. కేరళలోని ప్రముఖ దేవాలయాలలోకి ప్రవేశించే ముందు పురుషులు పైన ధరించే అంగీ, టీషర్ట్స్ లాంటివి వేసుకోకుండా రావాలనే దీర్ఘకాల ఆచారాన్ని రద్దు చేయాలని స్వామి సచ్చిదానంద పిలుపునిచ్చారు.
శివగిరి మఠాధిపతి సంచలన వ్యాఖ్యలు
సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురు స్థాపించిన ప్రఖ్యాత శివగిరి మఠాధిపతి అయిన స్వామి సచ్చిదానంద చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేరళలోని వర్కలాలో జరిగిన యాత్రా సదస్సులో ఆయన మాట్లాడుతూ కేరళలోని ఆలయాలలో దర్శనానికి వచ్చే సమయంలో పాటించే ఆచారంపై మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. పురుష భక్తులు షర్ట్, టీషర్ట్ లాంటివి ఏవీ ధరించకుండా దర్శనానికి వస్తున్న ఈ ఆచారాన్ని సామాజిక దురాచారంగా అభివర్ణించారు. సాధ్యమైతే దీన్ని రద్దు చేయాలని కోరారు. కేరళ రాష్ట్రంలోని అనేక దేవాలయాలలో ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారని పేర్కొన్నారు.
ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనే తన భావనను ప్రచారం చేయడానికి శ్రీ నారాయణ గురు శివగిరి మఠం స్థాపించారు. ఈ మఠం కేరళలోని వెనుకబడిన ఈజావ హిందూ వర్గానికి ప్రధాన పుణ్యక్షేత్రం. నారాయణ గురు ఒక సంఘ సంస్కర్తగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడారు. అట్టడుగు సామాజిక వర్గాల వారు దేవాలయాలలో ప్రవేశించి పూజలు చేసుకునే హక్కులను ఆయన సాధించారు. అయితే కేరళతో పాటు దేశంలోని పలు ఆలయాలలో పురుష భక్తులు పైన వస్త్రాలు లేకుండా దైవ దర్శనం చేసుకోవాలని నిబంధనలు ఉన్నాయి. అయితే అది ఓ సమాజాక దురాచారం అని, దాన్ని మనం రూపుమాపుదాం అన్నారు. గతంలో పురుషులు "పూనూల్" (బ్రాహ్మణులు ధరించే పవిత్రమైన జంజం) ధరించేలా చూసేందుకు పైన వస్త్రాలను తొలగించడం ప్రారంభించారు. ఇప్పుడు దేవుడు అందరికీ చేరువయ్యారని, అందరికీ ఆలయాలలో ప్రవేశం ఉన్నప్పటికీ పాత ఆచారం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.
స్వామి సచ్చిదానంద విచారం
శ్రీనారాయణ గురు ఈ ఆచారం ప్రబోధాలకు విరుద్ధం. కానీ ఇప్పటికీ కొన్ని ఆలయాలు దాన్ని కొనసాగించడంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.కొన్ని ఆలయాల్లో అన్య మతస్తులను అనుమతించడం లేదని, కొన్ని శ్రీ నారాయణ ఆలయాలు కూడా ఇదే విధానాన్ని పాటిస్తున్నాయని తెలిసి విచారం వ్యక్తం చేశారు. ఆలయ సంస్కృతిని ఆధునీకరించిన వ్యక్తి శ్రీ నారాయణ గురు అని.. ఆయన మార్గంలో మనం నడవాల్సిన అవసరం ఉంది.
స్పందిన సీఎం పినరయి విజయన్
ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా హాజరయ్యారు. స్వామి సచ్చిదానంద చేసిన వ్యాఖ్యలకు ఆయన మద్దతు తెలిపారు. స్వామీజీ చెప్పింది నిజమని, అలాంటి కట్టుబాట్లకు స్వస్తి పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.