Chopper Crashed In Pune: బుధవారం ఉదయం పూణేలోని బవ్‌ధాన్‌లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలటులు, ఒక ఇంజినీర్ చనిపోయారు. ఇదే హెలికాప్టర్‌లో ఎన్‌సిపి ఎంపి సునీల్ తట్కరే ప్రయాణించాల్సి ఉంది. ఆయన్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్న టైంోలనే ఘోరం జరిగిపోయింది. 


సునీల్ తత్కరే ముంబై నుంచి పూణేకు వెళ్లాల్సి ఉంది. ఆయన్ని తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ ముంబైకి వెళ్తుండగా బావ్‌ధాన్‌లోని కొండ ప్రాంతంలో కూలిపోయింది.
బుధవారం ఉదయం ఆక్స్‌ఫర్డ్ గోల్ఫ్ క్లబ్ హెలిప్యాడ్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెరిటేజ్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్ ముంబైలోని జుహు వైపు వెళుతోంది. రెండు ఇంజిన్‌లు ఉన్న ఈ అగస్టా హెలికాప్టర్‌లోనే సునీల్‌ మంగళవారం ప్రయాణం చేశారు. పూణె నుంచి పర్లీకి వెళ్లి తిరిగి వచ్చారు. తర్వాత హెలికాప్టర్‌ను పూణేలోనే వదిలేసి ముంబై వెళ్లిపోయారు. ఈ ఉదయం మళ్లీ హెలికాప్టర్‌లో రాయగడలోని సుతార్‌వాడికి వెళ్లాల్సి ఉంది.
బావ్‌ధాన్‌లోని బుద్రుక్ గ్రామ సమీపంలో ఉదయం 6:45 గంటలకు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో హెలికాప్టర్‌లోని ఇద్దరు పైలట్లు, ఒక ఇంజనీర్ మరణించారు. మరణించిన పైలట్లను కెప్టెన్ పిళ్లై, కెప్టెన్ పరమజిత్ సింగ్‌గా గుర్తించారు. చనిపోయిన ఇంజనీర్ పేరు ప్రీతమ్ భరద్వాజ్.


అగ్నిమాపక శాఖ వాహనాలతోపాటు పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని పింప్రీ చించ్వాడ్ పోలీస్ కమిషనర్ వినయ్ కుమార్ చౌబే తెలిపారు.
హెలికాప్టర్ కూలిపోయిన వెంటనే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయని దీంతో హెలికాప్టర్‌ మొత్తం పేలిపోయిందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. దీనిపైనే దర్యాప్తు చేస్తున్నామన్నారు. రెండు అంబులెన్స్‌లు, నాలుగు ఫైర్‌ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఉదయం కాస్త వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో కొండ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు హెలికాప్టర్ క్రాష్ అయ్యి ఉండవచ్చనే అభిప్రాయం ఉంది. మృతదేహాలను పూణెలోని సాసూన్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. 


Also Read: అమెజాన్ తో బిజినెస్ చేసే రిటైలర్లకు బంపర్ ఆఫర్..