Bengaluru Rains : ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు బెంగళూరు నీట మునిగింది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో జనం ఇబ్బంది పడ్డారు. నగరవాసులు ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఈ క్రమంలోనే వరదలు కారణంగా జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో సెల్లార్‌లో ఉన్న నీటిని తొలగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మన్మోహన్ కామత్ (63), దినేష్ (12) అనే ఇద్దరు చనిపోయారు.
బిటిఎం 2వ స్టేజ్ సమీపంలోని ఎన్ఎస్ పాల్యలోని మధువన్ అపార్ట్‌మెంట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న కామత్ సాయంత్రం 6.15 గంటలకు సెల్లార్‌లో ఉన్న నీటిని తొలగించే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రమాదం జరిగింది. అతన్ని రక్షించేందుకు వచ్చిన దినేష్ కూడా అక్కడే చనిపోయాడు. పోలీసు చెప్పిన వివరాల ప్రకారం "అతను ఒక మోటారు తెచ్చి, దానిని సాకెట్‌కు కనెక్ట్ చేసి, నీటిని పంప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో విద్యుత్ షాక్ కొట్టింది. స్పాట్‌లోనే కామత్ చనిోయాడు. " అని వివరించారు. అక్కడే పని చేస్తున్న దినేష్ రక్షించే ప్రయత్నం చేశాడు. అతను కూడా విద్యుత్ షాక్‌కు గురయ్యారు. రెండు కేసుల్లో అసహజ మరణాల కింద నమోదు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
బెంగళూరులో కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సాయి లేఅవుట్ తీవ్రంగా నష్టపోయింది. కొన్ని చోట్ల ఛాతీ వరకు నీళ్లు వచ్చాయి. ఇళ్ళు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడం, ఇళ్ళు మునిగిపోవడం, తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది.
పరిస్థితి గమనించిన ఎమ్మెల్యే ఎసి శ్రీనివాస్ తన నియోజకవర్గంలోని నీట మునిగిన ప్రాంతాలను సందర్శించారు. జెసిబిలో వచ్చి నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించారు. అధికారులతో కలిసి శ్రీనివాస్ నివాసితులతో మాట్లాడి భవిష్యత్తులో వరదలను నివారించడానికి చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే తిరిగిన ప్రాంతం నీటిలో మునిగిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నీటిలో ప్రజలు కొట్టుకుపోతున్నట్లు కనిపించాయి. డ్రైనేజీ వ్యవస్థలు పూర్తిగా పూడుకుపోయాయి. దీంతో నీరు రోడ్లపైనే నిలబడిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది.
వరదలు పదేపదే వస్తున్నందున దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం, మురుగునీటి కాలువలు మూసుకుపోవడంపై మండిపడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని సమస్యలు పరిష్కారం కాలేదని అంటున్నారు. అందుకే బెంగళూరుకు ఇలాంటి దుస్థితి వచ్చిందని ఫైర్ అవుతున్నారు.