Haryana Clashes:
ఆరుగురు మృతి
హరియాణాలోని నూహ్‌లో విశ్వహిందూ పరిషత్ (VHP) నిర్వహించిన ఊరేగింపు అల్లర్లకు దారి తీసింది. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఒక్కసారిగా రాష్ట్రమంతా కలకలం రేగింది. ఇప్పటికే అప్రమత్తమైన ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను మొహరించింది. శాంతి భద్రతలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ అల్లర్లతో సంబంధం ఉన్న 116 మందిని అరెస్ట్ చేశారు. 41 FIRలు నమోదయ్యాయి. ఈ ఘర్షణలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. వీరిలో ఇద్దరు హోంగార్డ్‌లతో పాటు ముగ్గురు సాధారణ పౌరులు, ఓ ఇమామ్ ఉన్నారు. హరియాణాలో గొడవ సద్దుమణగకముందే అటు గుడ్‌గావ్‌లోనూ ఇదే తరహా కలహాలు మొదలయ్యాయి. ఫలితంగా ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. NCR ప్రాంతం పోలీసుల పహారాలో ఉంది. పలు చోట్ల విద్యాసంస్థలు బంద్ చేశారు. ఈ అల్లర్లపై నిరసనగా VHP మేవట్‌లో ఆందోళనలకు పిలుపునిచ్చింది. వీహెచ్‌పీతో పాటు బజ్‌రంగ్ దళ్ మహా పంచాయత్‌ని నిర్వహించాలని నిర్ణయించుకుంది. రెండు రోజులుగా హరియాణాలో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి.
జైశ్రీరామ్ నినాదాలు..
ఆందోళనకారులు అర్ధరాత్రి పూట ఓ రెస్టారెంట్‌ని తగలబెట్టారు. ఓ వర్గానికి చెందిన రెస్టారెంట్‌ని తగలబెడుతూ మసీదు ముందు నిలబడి జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. బాద్‌షాపూర్ మార్కెట్‌ని మూసేశారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తనీ నమ్మొద్దని ఢిల్లీ పోలీసులు ప్రజలకు సూచించారు. ఏదైనా సమస్య తలెత్తితే 112 కి డయల్ చేయాలని ప్రకటించారు. త్వరలోనే పరిస్థితులు అదుపులోకి తీసుకొస్తామని పోలీసులు స్పష్టం చేశారు. సున్నిత ప్రాంతాల్లో సెక్యూరిటీ టైట్ చేశారు. అదనపు బలగాలను పంపారు. హరియాణాలో VHP ఊరేగింపునకు సంబంధించి అధికారులకు స్పష్టమైన సమాచారం లేదని, అందుకే ఇలా అల్లర్లు జరిగాయని చెప్పారు డిప్యుటీ సీఎం దుశ్యంత్ చౌతాలా. అన్ని పెట్రోల్ బంక్‌లలో బాటిల్స్‌లో పెట్రోల్, డీజిల్ ఇవ్వకూడదని అధికారులు ఆదేశించారు. ఈ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరి హోం గార్డుల కుటుంబాలకు రూ.57 లక్షల పరిహారం ప్రకటించారు. కుట్రపూరితంగానే ఈ హింసను రెచ్చగొట్టారని ఆరోపించారు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.