Manohar Lal Khattar Resign: సార్వత్రిక ఎన్నికల ముంగిట హరియాణాలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ బండారు దత్తాత్రేయకు రాజీనామా లేఖను సమర్పించారు. ఆయనతో పాటు డిప్యూటీ దుష్యంత్ చౌతాలా, మంత్రి మండలి సభ్యులు కూడా తమ రాజీనామాలు సమర్పించారు. ఎంపీ సీట్ల విషయంలో బీజేపీ, జేజేపీ (జననాయక్ జనతా పార్టీ) కూటమిలో ఇబ్బందులు తలెత్తడంతో ఖట్టర్ పదవి నుంచి తప్పుకొన్నారు. ఈ క్రమంలో అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ రోజే కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. కాసేపట్లో బీజేపీఎల్పీ సమావేశం నిర్వహించి తదుపరి సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రేసులో నయబ్ సైనీ ఉన్నట్లు సమాచారం. 


తాజా పరిణామాలతో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో బీజేపీ రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. హరియాణా అసెంబ్లీలో 90 స్థానాలుండగా సర్కారు ఏర్పాటుకు 46 సీట్లు అవసరం. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీకి మెజారిటీ తక్కువగా రావడంతో జననాయర్ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి 41, జేజేపీకి 10, కాంగ్రెస్ కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో పాటు బీజేపీకి ఆరుగురు స్వతంత్రులు, ఒక హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు కూడా ఉంది. దీంతో జేజేపీ విడిపోయిన తర్వాత కూడా బీజేపీకి 48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని లెక్క తేలుతోంది. 


Also Read: CAA: సీఏఏ అమలు - కేంద్రంపై తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తీవ్ర అసహనం, ఫస్ట్ రియాక్షనే పీక్స్