Hanuman Chalisa Row: హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్ట్ అయిన అమరావతి ఎంపీ, సినీ నటి నవనీత్ రాణా దంపతులు బెయిల్ కోసం మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. 


ముంబయి సెషన్ కోర్టులో బెయిల్ కోసం నవనీత్ దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. ఏప్రిల్ 29 వరకు విచారణ చేపట్టబోమని కోర్టు తెలిపింది. విచారణ తేదీ లోపు ఈ అంశంపై పోలీసులు నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. 


బాంబే హైకోర్టు


అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా దంపతులకు బాంబే హైకోర్టులో సోమవారం చుక్కెదురైంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తానని సవాల్ చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును కొట్టివేయాలన్న పిటిషన్‌ను తిరస్కరించింది.


మహారాష్ట్ర సీఎం నివాసం అయిన మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠిస్తానని నవనీత్ కౌర్ సవాల్ చేశారు. ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయిన తర్వాత మహారాష్ట్రలో భయానక వాతావరణం పెరిగిందని, అందుకే  "మాతో శ్రీ " ఎదుట హనుమాల్ చాలీసా పఠిస్తానని ఆమె అన్నారు. 


శివసేనకు సవాల్


నవనీత్ కౌర్ భర్త రవి రాణా కూడా ఎమ్మెల్యేనే. ఆయనతో కలిసి హనుమాన్ చాలీసా పఠించేందుకు వెళ్లక ముందే  శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ముంబయిలోని వారింటిముందు ఆందోళనకు దిగారు. శివసేనతో పోరాడుతూండటంతో కేంద్రం ఆమెకు వై కేటగిరి భద్రత కల్పించింది. 


రాణా దంపతులకు అధికార శివసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివసేనను సవాల్‌ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, మహారాష్ట్రలో మీరు ప్రశాంతంగా గడపలేరంటూ శివసేన పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ హెచ్చరించారు.


ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి నవీనీత్ కౌర్ దంపతులను కోర్టులో హాజరు పరచగా వీరిద‍్దరికీ మే 6 వ‌ర‌కూ జుడీషియ‌ల్ రిమాండ్ విధిస్తున్న‌ట్లు బాంద్రా మెట్రో పాలిట‌న్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలిచ్చింది.  


మరో నేత


దిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోదీ అధికారిక నివాసం ముందు హనుమాన్‌ చాలీసా, నమాజ్‌, దుర్గా చాలీసా, నమోకర్ మంత్రం (జైన్ శ్లోకం), గురు గ్రంథ్ సాహిబ్ (సిక్కు గ్రంథం) చదివేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్‌సీపీకి చెందిన ఫహ్మిదా హసన్ ఖాన్ కోరారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.


ఆ తర్వాత


మోదీ ఇంటి ముందు ఇవన్నీ చదివేందుకు అనుమతి ఇస్తే అనంతరం తాను హనుమాన్ చాలీసా పఠిస్తానని, తన ఇంట్లో దుర్గాపూజ కూడా చేస్తానని ఎంఎస్ ఖాన్ చెప్పారు. ఆమె రాసిన ఈ లేఖ ప్రస్తుతం వైరల్‌గా మారింది.


Also Read: Hanuman Chalisa Row: ప్రధాని మోదీని తాకిన హనుమాన్ చాలీసా ఎఫెక్ట్


Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్‌కు సాయం చేస్తాం- రష్యాకు ఓటమి తప్పదు: అమెరికా