Union Budget Preparation Process: ఏటా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ముందు జరిగే హల్వా వేడుక నేడు జరిగింది. కేంద్ర బడ్జెట్ 2024 రూపకల్పన ఆఖరు దశకు రావడంతో ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లోని బడ్జెట్ ప్రెస్ వద్ద హల్వా వేడుకను ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్వహించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు సహాయ మంత్రి పంకజ్ చౌధురి ఈ వేడుకలో పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ 2024ను జూలై 23న ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.


గత మూడు కేంద్ర బడ్జెట్‌ల తరహాలోనే ఈసారి ప్రవేశపెట్టబోతున్న మధ్యంతర బడ్జెట్ 2024ను కూడా పేపర్ లెస్ గానే ప్రవేశపెట్టనున్నారు. అన్ని రకాల బడ్జెట్ డాక్యుమెంట్లు, వార్షిక ఆర్థిక నివేదిక, డిమాండ్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్స్ వంటి అన్ని ‘యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్’లో చాలా సులభంగా వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. సాధారణ ప్రజలకు కూడా ఈ యాప్ ద్వారా బడ్జెట్ చూసే వీలుంటుంది.


ఇంగ్లీష్, హిందీలో ఉన్న ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. www.indiabudget.gov.in వెబ్ పోర్టల్ నుంచి కూడా యాప్ డౌన్ లోడ్ చేసుకునే వీలుంది. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత అన్ని రకాల బడ్జెట్ డాక్యుమెంట్లు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి.