Controversial IAS trainee Pooja Khedkar has been recalled by UPSC :  దేశంలో కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ను రీకాల్ చేశారు. ఆమెను ముస్సోరి ట్రైనింగ్ సెంటర్ లో రిపోర్టు చేయాలని యూపీఎస్సీ ఆదేశించింది. జిల్లా ట్రైనింగ్​ ప్రోగామ్​లో భాగంగా ఆమె నిర్వర్తిస్తున్న విధుల నుంచి రిలీవ్​ కావాలని ఆదేశాలు జారీ చేసింది. 


పూజా ఖేద్కర్ పై అనేక ఆరోపణలు                                          


పూజా ఖేద్కర్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ట్రైనింగ్ లోనే ఆమె అధికార దర్పం ప్రదర్శించి సొంత కారుపై ప్రభుత్వ లోగోలతో తిరిగారు. ప్రత్యేక సౌకర్యాల కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఇవి బయటకు రావడంతో ఆమె యూపీఎస్సీకి సమర్పించిన డాక్యమెంట్లపైనా ఆరోపణలు ప్రారంభమయ్యాయి. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఎంపిక అయ్యేందుకు వైకల్యం,ఓబీసీ సర్టిఫికేట్‌లను ఫేక్ వి తయారు చేయించి పెట్టారన్న ఆరోపణలు  వచ్చాయి.  2018, 2021లో అహ్మద్‌నగర్ జిల్లా సివిల్ హాస్పిటల్ అందించిన రెండు సర్టిఫికేట్‌లను బెంచ్‌మార్క్ డిజేబిలిటీస్  కేటగిరీ కింద యూపీఎస్సీకి సమర్పించారు.  వైద్య పరీక్షల కోసం ఆమెను ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌కు యూపీఎస్సీ సిఫార్సు చేసింది. కానీ ఆమె టెస్టులకు హాజరుకాలేదు. మొత్తం ఆరు సార్లు టెస్టులకు హాజరు కాలేదు. దీంతో ఆమె సమర్పించినవి తప్పుడు సర్టిఫికెట్లన్న ఆరోపణలు వస్తున్నాయి. 


తల్లిదండ్రుల తీరు కూడా వివాదాస్పదమే                         


మరో వైపు ఆమె తల్లిదండ్రుల వ్యవహారం కూడా వివాదాస్పదమయింది. ఓ భూవివాదంలో ఫూజాఖేద్కర్ తల్లి తుపాకీతో కొంత మందిపై హల్ చల్ చేసిన వైనం వీడియోలు వైరల్ అయ్యాయి. అలాగే పూజా ఖేద్కర్ తండ్రి కూడా ఆమె ట్రైని ఐఏఎస్ గా వస్తే.. ఆయనే పెత్తనం  చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి.  ఇవన్నీ అంతకంతకూ పెరిగి పెద్దవి కావడంతో .. చివరికి యూపీఎస్సీ విచారణ చేయించి ప్రాథమికంగా ఆమెను విచారణ  నుంచి వెనక్కి పిలిపించాలని నిర్ణయించారు. 


అనేక అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు                              


యూపీఎస్పీ పరీక్షల్లో ఆమె అనేక రకాలుగా అవకతవకలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.  సివిల్స్‌ పరీక్షకు ఆమె వేర్వేరు పేర్లతో హాజరైనట్లు కొన్ని మీడియా సంస్థలు ప్రకటించాయి.  2019లో ఖేద్కర్‌ పూజా దిలీప్‌రావు అనే పేరుతో ప్రిలిమ్స్‌ రాయగా.. 2022లో పూజా మనోరమా దిలీప్‌ ఖేద్కర్‌ పేరుతో పరీక్ష రాశారని చెబుతున్నారు.    సెంట్రల్‌ అప్పిలేట్‌ ట్రైబ్యూనల్‌కు చేసుకున్న దరఖాస్తుల్లోనూ తన వయసును వేర్వేరుగా పేర్కొన్నారు.  ఆమె నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఎంబీబీఎస్‌లో చేరినట్లు కాలేజీ యాజమాన్యం  ప్రకటించింది.