USA H1b Visa Fees News Updates | అమెరికాలో జాబ్ చేయాలనుకునే టెకీలకు ఊరట కలిగింది. అమెరికా హోం సెక్యూరిటీ విభాగం (DHS) H-1B వీసా కోసం లక్ష డాలర్ల దరఖాస్తు రుసుముపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో అనేక మినహాయింపులు ఉన్నాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం, F-1 (విద్యార్థి) వీసా నుంచి H-1B వీసా కేటగిరీకి మారుతున్న వారు ఈ భారీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అమెరికాలో ఉంటూ వీసా సవరణలు, స్టేటస్ మార్పు లేదా వ్యవధి పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకునే H-1B వీసా హోల్డర్‌లకు సైతం ఈ భారీ రుసుము వర్తించదు.
ఇదివరకే వీసా ఉన్న వారికి ఏ సమస్య లేదు
అంతేకాకుండా, ఇప్పటికే ఉన్న H-1B వీసా హోల్డర్‌లు అమెరికా దేశంలోకి రావడానికి, వారి దేశానికి వెళ్లడానికి ఎటువంటి ఆంక్షలు ఉండవు. ఈ రుసుము అమెరికా వెలుపల ఉన్న, చెల్లుబాటు అయ్యే H-1B వీసా లేని కొత్త దరఖాస్తుదారులకు వర్తిస్తుంది. కొత్త దరఖాస్తు ప్రక్రియ కోసం ఆన్‌లైన్ చెల్లింపు (H1b Visa Fees Link) లింక్ కూడా విడుదల చేయబడింది.
ట్రంప్ ప్రభుత్వంపై వాణిజ్య మండలి దావా
అమెరికా వాణిజ్య మండలి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ట్రంప్ ప్రభుత్వంపై దావా వేసిన సమయంలో ఈ క్లారిటీ వచ్చింది. ఈ హెచ్1బీ వీసా ఫీజు చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఇది అమెరికా వ్యాపారాలపై తీవ్రమైన ఆర్థిక ప్రభావాన్ని చూపుతుంది. అమెరికా కంపెనీలు తమ కార్మిక వ్యయాన్ని భారీగా పెంచవలసి ఉంటుందని లేదా స్కిల్స్ కలిగిన విదేశీ ఉద్యోగుల నియామకాన్ని తగ్గించాల్సి ఉంటుందని ఆ సంస్థ తెలిపింది.
ట్రంప్ ప్రభుత్వానికి సవాల్
ట్రంప్ ప్రభుత్వానికి ఇది రెండవ అతిపెద్ద చట్టపరమైన సవాల్ లాంటిది. కార్మిక సంఘాలు, విద్యా నిపుణులు, మతపరమైన సంస్థల సమూహం అక్టోబర్ 3న దావా వేసింది. సెప్టెంబర్ 19న సంతకం చేసిన ఈ ప్రకటన అమెరికా పౌరులకు ఉపాధిని పెంచడమే లక్ష్యమన్నారు ట్రంప్. ఈ నిర్ణయం ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్‌లలో వారు అమెరికాకు తిరిగి వస్తారా లేదా అనే విషయంపై గందరగోళం నెలకొంది.
సెప్టెంబర్ 20న IANSతో వైట్ హౌస్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఇది ఒకసారి మాత్రమే చెల్లించే ఫీజు. ఇది కొత్త వీసా దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుంది. వీసా రెన్యూవల్స్ చేస్తున్న వారికి, ఇదివరకే వీసా కలిగి ఉన్న వారికి కాదని తెలిపింది. 2024లో భారత సంతతికి చెందిన నిపుణులు మొత్తం ఆమోదించబడిన H-1B వీసాలలో 70 శాతం కంటే ఎక్కువ ఉన్నారు. వీసా ఆమోదాలలో పెండింగ్‌లో ఉన్న కేసుల భారీ బ్యాక్‌లాగ్, భారతదేశం నుండి వచ్చిన టాలెంట్ కలిగిన దరఖాస్తుదారుల సంఖ్య దీనికి కారణం. భారత్ లాంటి దేశాల నుంచి అమెరికాకు వలసలు నిరోధించడానికి ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసా ఫీజు ఛార్జీలను ఏకంగా లక్ష డాలర్లు చేసి భారీ షాకిచ్చింది. ఆ మొత్తాన్ని తాము కట్టలేమని దిగ్గజ సంస్థలు సైతం పెదవి విరిచాయి.