Gyanvapi Case:
హిందూ వస్తువులు సమర్పించండి: కోర్టు
జ్ఞానవాపి మసీదు సర్వేలో బయటపడిన అన్ని వస్తువులనూ హ్యాండ్ ఓవర్ చేయాలని వారణాసి కోర్టు అధికారులను ఆదేశించింది. హిందూ మతానికి సంబంధించిన వస్తువులన్నింటినీ కోర్టుకి సమర్పించాలని తేల్చి చెప్పింది. జిల్లా మెజిస్ట్రేట్‌కి ఇవ్వాల్సిందిగా స్పష్టం చేసింది. జిల్లా మెజిస్ట్రేట్ లేదా మెజిస్ట్రేట్ నామినేట్ చేసిన వ్యక్తి ఆ వస్తువులను జాగ్రత్తగా చూసుకునే బాధ్యతలు తీసుకోవాలని..కోర్టు అడిగినప్పుడు వాటిని ప్రవేశపెట్టాలని ఆదేశించింది. జ్ఞానవామి మసీదులో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించాలని ఇప్పటికే అలహాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారణకు ముందు వారణాసి కోర్టు ఈ ఆదేశాలివ్వడం కీలకంగా మారింది.
"జ్ఞానవాపి మసీదులో ASI సర్వేలో హిందూ మతానికి సంబంధించిన వస్తువులు కానీ, ఆధారాలు కానీ, ఇంకే ఇతర సామగ్రి దొరికినా వాటిని జిల్లా మెజిస్ట్రేట్‌కి అందించాలి. జిల్లా మెజిస్ట్రేట్ వాటిని జాగ్రత్తగా చూడాలి. ఆయన కాకపోతే...ఆయన నియమించిన వ్యక్తి ఎవరైనా ఆ వస్తువులను జాగ్రత్త పరచాల్సి ఉంటుంది. ఈ కేసుకి సంబంధించిన విచారణలో ఎప్పుడు అవసరం వచ్చి కోర్టు అడిగినా వెంటనే ఆ ఆధారాలను సమర్పించాలి"
- వారణాసి కోర్టు
మసీదులో తవ్వకాలు జరపకుండా, కట్టడానికి హాని కలిగించని రీతిలో సర్వే చేయాలనే షరతుతో సర్వేకు అనుమతి ఇచ్చింది కోర్టు. అయితే సర్వే కోసం కోర్టు ఇచ్చిన గడువు సెప్టెంబర్ 2వ తేదీతో ముగిసింది. దీంతో... సర్వే పూర్తిచేయడానికి ఇంకా 8వారాల సమయం కావాలంటూ జిల్లా జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జిల్లా జడ్జి ఏకే విశ్వేష్ సెలవులో ఉన్నందున, ఇన్‌ఛార్జ్ జిల్లా జడ్జి సంజీవ్ సిన్హా ఈ కేసుపై తదుపరి విచారణను వాయిదా వేశారు. కాశీ విశ్వనాథ్ ఆలయానికి ఆనుకుని ఉన్న కాంప్లెక్స్‌పై ఆగస్టు 4న శాస్త్రీయ సర్వే ప్రారంభమైంది. హిందూ తరపు న్యాయవాది.. విష్ణు శంకర్ జైన్ కూడా.. సర్వే ఇంకా అసంపూర్తిగా ఉందని.. ప్రాథమిక నివేదిక సమర్పించడానికి ASIకి మరింత సమయం ఇవ్వాలని సూచించారు. హిందూ తరపు మరో న్యాయవాది సుధీర్ త్రిపాఠి కూడా సర్వే ఇంకా పూర్తికాలేదని చెప్పారు. సర్వే పూర్తికాకుండా ఇచ్చే నివేదిక ఇచ్చినా... అది అసంపూర్తిగానే ఉంటుందని.. కనుక.. ASI సూచన మేరకు సమయం ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు.
ఇప్పటి వరకూ అక్కడ హిందూ ఆలయానికి సంబంధించిన కొన్ని సంకేతాలను గుర్తించారు అధికారులు. వీటిని సేకరించిన అధికారులు వాటిని భద్రపరిచారు. బేస్‌మెంట్‌లో చేపట్టిన సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హిందువులు చెబుతున్న ప్రకారం...మసీదు బేస్‌మెంట్‌లో నాలుగు అడుగుల శివుడి విగ్రహం దొరికింది. ఈ విగ్రహంతో పాటు 2 అడుగుల త్రిశూలం కూడా ఉంది. అంతే కాదు. అక్కడి గోడలపై కమలం పువ్వు గుర్తులు కనిపించినట్టు హిందువులు చెబుతున్నారు. ఓ జంతువు విగ్రహంతో పాటు, ఓ దేవత విగ్రహం కూడా గుర్తించినట్టు వివరించారు. మరి కొన్ని విగ్రహాల శకలాలు కనిపించినట్టు తెలిపారు. మూడో రోజు కూడా భారీ భద్రత నడుమ సర్వే జరుగుతోంది. మసీదులో పశ్చిమాన ఉన్న గోడపై హిందూ ఆలయానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు కనిపించడం వల్ల ప్రత్యేక దృష్టి పెట్టారు. వీటి కోసం ప్రత్యేక యంత్రాలు తెప్పించి మరీ సర్వే చేస్తున్నారు.
Also Read: సనాతన ధర్మాన్ని ముక్కలు చేయడమే వాళ్ల అజెండా, విపక్ష కూటమిపై ప్రధాని మోదీ ఫైర్