Gurugram Restaurant Incident: గురుగ్రామ్: హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లోని ఓ రెస్టారెంట్‌లో షాకింగ్ ఘటన జరిగింది. భోజనం చేసేందుకు సరదాగా రెస్టారెంట్ కు వెళ్లిన కొందరు కస్టమర్లకు ప్రాణాల మీదకి వచ్చింది. మౌత్ ఫ్రెషనర్‌ను వినియోగించిన కొందరు కస్టమర్లు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కస్టమర్లు రక్తం కక్కుకోవడంతో అక్కడ భయానక వాతావరణం కనిపించింది. ఐదుగురు కస్టమర్లతో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మౌత్ ఫ్రెష్‌నర్ వాడితే రక్తపు వాంతులు చేసుకోవడం, తీవ్ర అస్వస్థతకు లోను కావడం గురుగ్రామ్‌లో కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే..
గురుగ్రామ్ లోని ఓ రెస్టారెంట్ కు కొందరు కస్టమర్లు వెళ్లారు. కస్టమర్లు అక్కడ భోజనం చేసిన తరువాత మౌత్ ఫ్రెషనర్ వినియోగించారు. కొన్ని సెకన్లలోనే వారికి నోరు మండిపోయిన ఫీలింగ్ కలిగింది. వారిలో ఐదు మంది కస్టమర్లు రక్తపు వాంతులు చేసుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. వాంతులు చేసుకున్న ఐదుగురు కస్టమర్లను వైద్య చికిత్స అందించేందుకు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మౌత్ ఫ్రెషనర్‌లో విషం ఏమైనా కలిసిందా, లేక ఏమైనా హానికారక రసాయానాలు వాడారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ మౌత్ ఫ్రెషనర్‌లో ప్రాణాంతక యాసిడ్ ఉందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని డాక్టర్లు ధ్రువీకరించారని పిపా న్యూస్ వెల్లడింది. మౌత్ ఫ్రెషనర్‌లో ఉన్న కొన్ని పదార్థాలు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందన్నారు. బాధితులు వాంతులు చేసుకోవడం, నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి బటయకు ఊసే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉన్న వీడియో వైరల్ గా మారింది. సరదాగా రెస్టారెంట్ కు వెళ్తే ఇలా ప్రాణాల మీదకి రావడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరుతూనే, రెస్టారెంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.