H3N2 వైరస్ వల్ల వచ్చే ఇన్‌ఫ్లుఎంజా కేసుల సంఖ్య భారత్‌లో పెరుగుతోంది. ఈ వార్త రాసే సమయానికి గుజరాత్‌లో H3N2 వైరస్ వల్ల ఒక మరణం సంభవించింది. 58 ఏళ్ల మహిళ ఈ ఇన్‌ఫ్లుఎంజా వైరస్ కారణంగా మరణించింది. ఆమె గుజరాత్ వడోదరలోని ఎస్‌ఎస్‌జీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.


దీనితో పాటు, ఈ వైరస్ కారణంగా, మన దేశంలో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు మరణించారు. ఈ వ్యాధి కారణంగా ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


మాస్క్ వాడాలంటున్న డాక్టర్లు
H3N2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌ను నివారించడానికి, వైద్యులు మాస్క్‌లను ఉపయోగించాలని సలహా ఇస్తున్నారు. వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు, ప్రజలు నిరంతరం చేతులు కడుక్కోవాలని, అలాగే ఏడాదికి ఒకసారి ఫ్లూ వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.


IDSP-IHIP (ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫారమ్)లో అందుబాటులో ఉన్న తాజా డేటా ప్రకారం, రాష్ట్రాలు మార్చి 9 వరకు H3N2తో సహా ఇన్‌ఫ్లుఎంజా యొక్క వేర్వేరు సబ్ వేరియంట్లకు సంబంధించిన మొత్తం 3,038 ధృవీకరించిన కేసులను రిపోర్టు చేశాయి. ఇందులో జనవరిలో 1,245, ఫిబ్రవరిలో 1,307, మార్చి 9 వరకు 486 కేసులు ఉన్నాయి.


ఆరోగ్య నిపుణులు ఏం చెప్పారంటే?
వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ప్రజా రవాణా, ఆసుపత్రులు, ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, ఇతర ప్రజా వాహనాలు వంటి అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో మళ్లీ మాస్క్‌లు ధరించాలని వైద్య నిపుణులు ప్రజలకు సూచించారు. ప్రజలు కూడా రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు.


H3N2, H1N1 రెండు రకాల ఇన్‌ఫ్లుఎంజా E వైరస్‌లను సాధారణంగా ఫ్లూ అని పిలుస్తారు. దీర్ఘకాలిక జ్వరం, దగ్గు, ముక్కు కారటం, ఒళ్లు నొప్పులు దీన్ని కొన్ని సాధారణ లక్షణాలు. కానీ తీవ్రమైన సందర్భాల్లో ప్రజలు ఊపిరి ఆడకపోవడం లేదా శ్వాసలో గురక కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది.


కర్ణాటకలో కరోనా
కర్ణాటకలో కోవిడ్ కేసుల సంఖ్య 500 దాటింది. మార్చి 13, 2023 వరకు, రాష్ట్రంలో మొత్తం 510 కోవిడ్ యాక్టివ్ కేసులను కనుగొన్నారు. సోమవారం రాష్ట్రంలో 62 కొత్త కేసులు నమోదయ్యాయి. మార్చి 12న దాని పాజిటివిటీ రేటు 4.5 శాతం కాగా, దాని మొత్తం వీక్లీ పాజిటివిటీ రేటు 2.60 శాతంగా ఉంది.