PM Modi: ఎన్నికలు సమీస్తున్న తరుణంలో కేంద్రం మరో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా బీజేపీ సర్కారు ఓ విస్తృత కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. దేశంలో చాలా మందికి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. వారిలో చాలా మంది అర్హత ఉన్నా.. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. అలాంటి వారికి పథకాలు అందించేందుకు ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ (Viksit Bharat Sankalp Yatra) పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతోంది. దీని కింద దేశంలోని 2.7 లక్షల పంచాయతీల్లో మెగా డ్రైవ్ చేపట్టనుంది.
ఈ డ్రైవ్లో ఆయా పథకాల అర్హులను గుర్తించి, వారికి ప్రయోజనాలు చేకూరేలా చర్యలు తీసుకోనున్నారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అందేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆరు నెలల లక్ష్యాన్ని నిర్దేశించారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇటీవల ఉన్నతాధికారులతో సమావేశమైన ప్రధాని మోదీ.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. వచ్చే 6 నెలల్లో దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు పూర్తిస్థాయిలో అందించాలని ఆదేశించారు. ఇప్పటికే ఈ విషయాన్ని గత కేబినెట్ సమావేశంలోనూ ప్రధాని ప్రస్తావించారు. కేంద్ర పథకాలను ప్రజలకు చేరువ చేసేలా దేశంలోని 2.7 లక్షల పంచాయతీల్లో అర్హులను గుర్తించాలని ప్రధాని ఆదేశించారు.
ప్రజలకు పథకాలు అందించేందుకు మరింత కష్టపడి పనిచేయాలని, సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందని లబ్ధిదారులకు వేగంగా చేరేలా చూడాలని మంత్రులకు సూచించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇందు కోసం ప్రత్యేకంగా ప్రచార, అవగాహన రథాలు రూపొందించనున్నారు. వీటి ద్వారా ఈ ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ కొనసాగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. దీపావళి తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కింద అర్హులైన ప్రజలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ), పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన, పోషణ్ అభియాన్, ఉజ్వల్ యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాలు అందిస్తారు.
ఇప్పటికే ఏపీ, పశ్చిమ బెంగాల్లో ఇలాంటి డ్రైవ్లు
అర్హత ఉండి పథకాలు అందుకోలేని వారికి అండగా నిలిచేలా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాళ్ ప్రభుత్వం ఇలాంటి డ్రైవ్లను నిర్వహించాయి. ఏపీలో ఇటీవల జనన్న సురక్ష పేరుతో అర్హులైన వారికి పథకాలు అందించేలా ప్రత్యేక క్యాంపులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి అర్హులను గుర్తించారు. వలంటీర్ల సాయంతో ప్రత్యేకంగా టోకన్లు జారీ చేయించారు. ప్రత్యేక క్యాంపులు నిర్వహించి అక్కడిక్కడే ప్రత్యేకంగా సర్టిఫికెట్లు మంజూరు చేశారు. అర్హులైన వారికి పథకాలు వర్తింపజేశారు. ఆధార్ అప్డేట్లు, ఫోన్ నెంబర్ లింక్, కుల, ఆదాయ సర్టిఫికెట్లను క్యాంపుల్లోనే మంజూరు చేసి పథకాలకు దరఖాస్తు చేయించారు. అర్హత ఉండి దరఖాస్తు వారికి రేషన్ కార్డులు తక్షణం మంజూరు చేశారు. పశ్చిమ బెంగాల్లో సైతం ఇలాంటి డ్రైవ్ జరిగింది. అర్హులకు పథకాలు అందించేందుకు మమత సర్కార్ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.