Gold Smuggling: తమిళనాడులో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. గుర్తు తెలియని వ్యక్తులు రెండు పడవల్లో శ్రీలంక నుంచి భారత్ కు సముద్ర మార్గంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా.. పక్కా సమాచారంతో అధికారులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఓ పడవలోని స్మగ్లర్లు తమ వద్ద ఉన్న 11 కిలోల బంగారాన్ని సముద్రంలో పడేశారు. భారత కోస్ట్ గార్డ్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ సిబ్బంది కలిసి రెండు రోజుల పాటు ఆపరేషన్ నిర్వహించి ఆ పసిడిని స్వాధీనం చేసుకున్నారు. మరో పడవలో 21.2 కిలోల బంగారం గుర్తించి పట్టుకున్నారు. ఈ రెండు ఘటనల్లో మొత్తం రూ.20 కోట్లకుపైగా విలువైన 32.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. కొంతమంది స్మగ్లర్లు పెద్ద ఎత్తున బంగారాన్ని శ్రీలంక నుంచి భారత్ కు అక్రమంగా తరలిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులకు సమాచారం వచ్చింది.   


దీంతో అధికారులు సముద్రంలో ప్రత్యేక నిఘా పెట్టారు. ఈక్రమంలోనే తమిళనాడులోని మండపం ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో రెండు బోట్ల కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. వాటిని వెంబడించగా.. తప్పించుకునే క్రమంలో ఓ పడవలోని ముగ్గురు స్మగ్లర్లు తమ వద్ద ఉన్న 11.6 కిలోల బంగారు కడ్డీలను సముద్రంలో పారేశారు. చివరకు వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. ప్రత్యేక ఆపరేషన్ లో భాగంగా డైవర్లను రంగంలోకి దించింది. నిందితులు పారేసిన బంగారాన్ని డైవర్లు వెతికి తీసుకువచ్చారు. మరో పడవలో 21 కిలోలకు పైగా బంగారాన్ని స్వాధనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.