G20 Summit: జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ భారత్ కు వస్తున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 8) నాడు ఢిల్లీకి చేరుకోనున్నారు. బ్రిటీష్ ప్రధాన మంత్రి అయ్యాక రిషి సునాక్ మొదటి సారి ఇండియా వస్తున్నారు. అందులో జీ20 సదస్సు దేశానికి వస్తుండటంపై రిషి సునాక్ స్పందించిన విషయం తెలిసిందే. ఈ శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన దేశానికి జీ20 సదస్సు నిర్వహించే అవకాశం వచ్చిందని వ్యాఖ్యానించారు. యూకే, భారత్ మధ్య ఉన్న సంబంధం వర్తమానం కంటే రెండు దేశాల భవిష్యత్తును ఎక్కువగా నిర్వచిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.


భారత్ లో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న సదస్సులో ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లను పరిష్కరించేందుకు భారత్ తో కలిసి పని చేస్తామని రిషి సునాక్ చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడం మొదలు వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేయడం వరకు అన్నింటిలోనూ పాలు పంచుకుంటామని అన్నారు. 


జీ20 సమావేశానికి హాజరు కావడానికి అగ్ర దేశాల నేతలు రేపు ఢిల్లీకి చేరుకోనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సనాక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తదితరులకు రెండు రోజుల పాటు ఢిల్లీలో ఆతిథ్యం ఇవ్వనున్నారు. బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ సెప్టెంబర్ 8వ తేదీన శుక్రవారం రోజు మధ్యాహ్నం 1.40 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే రిషి సునాక్  కు స్వాగతం పలుకుతారు. రిషి సునాక్ కు ఢిల్లీలోని షాంగ్రిలా హోటల్ లో బస ఏర్పాట్లు చేశారు. 


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. ఆయనకు కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్ స్వాగతం పలుకుతారు. జో బైడెన్ కు ఢిల్లీలోని ఐటీసీ మౌర్యలో బస ఏర్పాట్లు చేశారు. బైడెన్ భార్య జిల్ బైడెన్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన జీ20 సమావేశాలకు హాజరవుతారా లేదా అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. కానీ బైడెన్ కు నెగెటివ్ రిపోర్టు రావడంతో ఆయన భారత్ కు రానున్నట్లు ఇప్పటికే వైట్ హౌజ్ స్పష్టం చేసింది. 


కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రేపు సాయంత్రం 7 గంటలకు భారత్ కు చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ జస్టిన్ ట్రూడోకు ఆహ్వానం పలుకుతారు. ట్రూడో ఢిల్లీ లోని లలిత్ హోటల్ లో బస చేస్తారు. 


జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా శుక్రవారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. ఆయనకు కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆహ్వానం పలుకుతారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 


ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ రేపే ఢిల్లీకి చేరుకుంటారు. ఆయనకు ఇంపీరియల్ హోటల్ లో బస ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకుంటారు ఆంథోనీ ఆల్బనీస్.