జీ20 సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోంది భారత ప్రభుత్వం. శిఖరాగ్ర సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈనెల 9, 10వ తేదీల్లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జీ20 సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సుకు ప్రపంచదేశాల నుంచి నాయకులు తరలివస్తున్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఈ హైప్రొఫైల్ సమావేశాల సందర్భంగా.. భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నిఘా కెమెరాలతో డేగ కన్ను వేశారు. ఏ మూలు ఏ చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా... నిఘా పెంచారు. డాగ్‌ స్క్వాడ్స్‌ కూడా రంగంలోకి దిగాయి. దేశవిదేశాల నుంచి వస్తున్న అతిథుల కోసం ఢిల్లీలో ట్రాఫిక్‌ ఆంక్షలు కూడా విధిస్తున్నారు. 


జీ20 సదస్సు కోసం ఢిల్లీలో భద్రతా వలయాన్ని నిర్మించారు. మూడు రోజుల పాటు ఆంక్షలు కూడా విధించారు. ఈనెల 7వ తేదీ రాత్రి నుంచే నిర్దేశిత ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఢిల్లీ నగరంలో స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ, అమెజాన్ డెలివరీలను కూడా నిషేధించారు. NDMC ప్రాంతంలో డెలివరీ సేవలను అనుమతించేది లేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఈనెల 7వ తేది అర్ధరాత్రి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఢిల్లీలోకి వాహనాల ప్రవేశాన్ని కూడా నిలిపివేస్తున్నట్టు గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఢిల్లీలో ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు పబ్లిక్‌ హాలిడీ ప్రకటించారు. 9, 10వ తేదీ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించారు. ఐటీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం అమలు చేయాలని కంపెనీలకు సూచించారు. ఆంక్షలు అమల్లో ఉన్న నిర్దేశిత ప్రాంతాల్లో థియేటర్లు, రెస్టారెంట్లు కూడా మూసివేయాలని ఆదేశించారు. అంతేకాదు.. క్లౌడ్ కిచెన్‌లు, డెలివరీ సేవలకు కూడా అనుమతి నిరాకరించారు. 


జీ20 సమ్మిట్‌ జరుగుతన్న రోజుల్లో దేశ రాజధానిలో హైఅలర్ట్‌ కొనసాగుతూనే ఉంటుంది. అయితే.. జీ20 సదస్సు కోసం ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు ఢిల్లీలో మూడు రోజులు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఢిల్లీ పోలీసులు కొట్టిపారేశారు. అవన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు. కానీ, ఆ మూడు రోజుల్లో నిత్యావసర సౌకర్యాలు మాత్రమే ఢిల్లీ ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. కిరాణా షాపులు, ATMలు, మెడికల్ షాపులతో పాటు అత్యవసర సేవలు అందించే సంస్థలు మాత్రమే తెరిచి ఉంటాయి. దేశాధినేతలు, ప్రముఖుల బస చేస్తున్న ఫైస్టార్‌ హోటళ్ల ఉన్న ప్రాంతాలు.. వారు ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. మార్నింగ్ వాక్ కోసం కూడా ఢిల్లీ ప్రజలు బయటకు రావొద్దని సూచించారు పోలీసు అధికారులు. జీ20 సమావేశానికి హాజరయ్యే వీవీఐపీల భద్రత దృష్ట్యా వారు వెళ్లే మార్గాల్లోని మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేస్తున్నారు. నార్త్‌జోన్‌లో పలు రైళ్లు రద్దు చేశారు. 


జీ20 సదస్సు భద్రతలో భాగంగా... దేశ రాజధాని ఢిల్లీ శత్రు దుర్భేధ్యేయంగా మారిపోయింది. సాయుధ బలగాలు, ఎన్ఎస్జీ, ఎస్పీజీ, ఢిల్లీ పోలీసులు డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. చొరబాట్లు, ఉగ్రవాద చర్యలు,విధ్వంసం జరగకుండా చూసేందుకు... లక్షా 30వేల మంది భద్రతా సిబ్బందిని ఢిల్లీలో మోహరించారు. ఈవెంట్ వేదికల వద్ద బుల్లెట్ ప్రూఫ్ భద్రతను ఏర్పాటు చేశారు. ఇండియన్‌ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ కూడా రంగంలోకి దిగాయి. వందలాది డ్రోన్లు, రాడార్లు, ఫ్రంట్‌లైన్ ఫైటర్ జెట్లతో గగనతల భద్రతను సమీక్షిస్తున్నాయి. రాఫెల్స్, మిరాజ్-2000, సుఖోయ్-30MKI యుద్ధ విమానాలను కూడా మోహరించారు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని వైమానిక స్థావరాలను సంసిద్ధంగా ఉంచారు. సుమారు 400 మంది అగ్నిమాపక సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచనున్నారు.