G20 Summit 2023:
ఆఫ్రికన్ యూనియన్‌కి శాశ్వత సభ్యత్వం
G20 సదస్సులో తొలిరోజే ఆసక్తికర పరిణామం జరిగింది. సదస్సుని ప్రారంభిస్తూ ప్రసంగించిన ప్రధాని మోదీ చివర్లో కీలక ప్రకటన చేశారు. G20లో ఆఫ్రికన్ యూనియన్ (African Union)కు శాశ్వత సభ్యత్వం కల్పించారు. సభ్యులందరి ఆమోదంతో ఆఫ్రికన్ యూనియన్‌కి శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్టు ప్రధాని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆఫ్రికన్ యూనియన్ చీఫ్ అజాలీ అసౌమనీని (Azali Assoumani)ఆలింగనం చేసుకున్నారు. స్వయంగా తానే పర్మినెంట్ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చోబెట్టారు. దీనిపై అజాలీ ఆనందం వ్యక్తం చేశారు. సబ్‌కా సాథ్ నినాద స్ఫూర్తితోనే ఆఫ్రికన్ యూనియన్‌కి శాశ్వత సభ్యత్వం కల్పిస్తున్నట్టు ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
"సబ్‌కా సాథ్ నినాదం స్ఫూర్తితో ఆఫ్రికన్ యూనియన్‌కి G20 లో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాం. ఇందుకు సభ్యులందరూ ఆమోదం తెలుపుతున్నారనే విశ్వసిస్తున్నాను. మీ అంగీకారంతో ఆఫ్రికన్ యూనియన్‌కి శాశ్వత సభ్యత్వం కల్పిస్తున్నాం. మనం చర్చలు మొదలు పెట్టే ముందు AU ప్రెసిడెంట్ అజాలీ ఆయన స్థానంలో కూర్చోవాలని కోరుకుంటున్నాను"
- ప్రధాని నరేంద్ర మోదీ
ఇదే విషయాన్ని ప్రధాని మోదీ తన ట్విటర్‌లోనూ వెల్లడించారు. ఆఫ్రికన్ యూనియన్‌కి G20 లో శాశ్వత సభ్యత్వం కల్పించడం ఎంతో గౌరవంగా ఉందని ట్వీట్ చేశారు. గ్లోబల్ సౌత్ గొంతుకను ఇది మరింత బలపరుస్తుందని తెలిపారు.