G20 Summit 2023: 



AI కెమెరాలతో నిఘా 


దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న G 20 సమ్మిట్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. దేశాల అధినేతలు, ప్రతినిధులు వస్తుండడం వల్ల భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపింది. ఢిల్లీ పోలీసులు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. సెక్యూరిటీని మరింత పటిష్ఠం చేసేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) మాడ్యూల్స్‌తో నిఘా పెడుతున్నారు. AI ఆధారిత కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా G 20 సమ్మిట్‌ వేదిక పరిసరాల్లో చీమ చిటుక్కుమన్నా కనిపెట్టేస్తారు భద్రతా సిబ్బంది. అనుమానాస్పదంగా ఎవరు తిరిగినట్టు కనిపించినా వెంటనే గుర్తిస్తాయి ఈ కెమెరాలు. వీటితో పాటు సాఫ్ట్‌వేర్ అలార్మ్స్ కూడా ఏర్పాటు చేశారు. గోడలు ఎక్కడం, పరిగెత్తడం, వంగి నడవడం లాంటివి చేస్తే ఈ AI కెమెరాలు సెక్యూరిటీ సిబ్బందిని అలెర్ట్ చేస్తాయి. National Security Guard కమాండోలతో పాటు ఇండియన్ ఆర్మీ స్నైపర్స్‌ భారీ బిల్డింగ్‌లపై పహారా కాయనున్నారు. వీరితో పాటు ఇంటర్నేషనల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీలకు చెందిన సిబ్బంది కూడా ఢిల్లీకి రానుంది. అమెరికాకి చెందిన CIA,యూకేకి చెందిన MI-6, చైనాకి చెందిన MSS ఏజెన్సీలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి. తమ అధినేతలకు, ప్రతినిధులకు భద్రత కల్పించేందుకు తామే సెక్యూరిటీ ప్లాన్‌ సిద్ధం చేసుకున్నాయి ఈ ఏజెన్సీలు. భారత్‌కి చెందిన నిఘా వర్గాలు వారికి సాయం అందిస్తున్నాయి. ఇక ఈ సదస్సు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ (IAF)తో పాటు ఆర్మీ హెలికాప్టర్లు జల్లెడ పడుతున్నాయి. యాంటీ డ్రోన్ సిస్టమ్‌ని కూడా ఏర్పాటు చేయనున్నారు. 


లాక్‌డౌన్..


ట్రాఫిక్‌ సమస్య కలగకుండా పూర్తిగా లాక్‌డౌన్ పెట్టారు. అంతే కాదు. పోలీసులు పలు చోట్ల తనిఖీలు చేపడుతున్నారు. ఆ రెండు రోజుల పాటు వ్యాపారాలూ బంద్ చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌ హాజరు కానున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కీ భారత్ ఆహ్వానం పంపినప్పటికీ ఆయన రావడం లేదని తెలుస్తోంది. ఢిల్లీ, NCR ప్రాంతాల్లోని హోటల్స్‌లో రూమ్స్ బుకింగ్స్‌తో బిజీగా ఉన్నాయి. ITC Maurya, తాజ్ ప్యాలెస్, ది ఇంపీరియల్ సహా పలు ఫైవ్ స్టార్ హోటళ్లలోని రూమ్స్ బుకింగ్స్ పూర్తయ్యాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఐటీసీ మౌర్య హోటల్‌లో స్టే చేయనున్నారు. G 20 వెన్యూ వద్ద 50 ఆంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచనున్నారు. మెడికల్ స్టాఫ్‌ కూడా అందుబాటులో ఉంటుంది. హోటల్స్‌, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ అవ్వాలని కేంద్రం ఆదేశించింది. మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తితే వెంటనే చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని తేల్చి చెప్పింది. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ వద్ద ఇందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో పాటు AIIMS వద్ద కూడా ఏర్పాట్లు చేశారు. లేబర్ కమిషనర్ ఆఫీస్‌తో పాటు ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీలోని వ్యాపారులందరికీ నోటీసులు పంపింది.


Also Read: G20 Summit 2023: G-20 సమ్మిట్‌కి జిన్‌పింగ్ కూడా డుమ్మా! కారణమేమై ఉంటుంది?