G20 Summit 2023: 



జీ 20 సదస్సుకి జిన్‌పింగ్ దూరం..


సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీలో G 20 సదస్సు జరగనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ సమ్మిట్‌ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సదస్సుకి 20 దేశాలకు చెందిన అధినేతలతో పాటు అంతర్జాతీయ సంస్థలకు చెందిన ప్రతినిధులూ హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడి జో బైడెన్‌తో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కి ఆహ్వానం పంపింది భారత్. వీరిలో జో బైడెన్ తప్ప మిగతా ఇద్దరూ ఈ సదస్సుకి హాజరు కావడం లేదు. "రాలేకపోతున్నాను, దయచేసి ఏమీ అనుకోవద్దు" అంటూ ఇప్పటికే పుతిన్ ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల G20 సమ్మిట్‌కి హాజరు కాలేకపోతున్నానని వెల్లడించారు పుతిన్. ఆ తరవాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే విషయాన్ని Reuters వెల్లడించింది. జిన్‌పింగ్‌కి బదులుగా ఇద్దరు ప్రతినిధులు హాజరయ్యే అవకాశాలున్నాయి. అయితే..దీనిపై భారత్, చైనా విదేశాంగ శాఖల ప్రతినిధులు మాత్రం స్పందించలేదు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ తాను తప్పకుండా వస్తానని అధికారికంగా ప్రకటించారు. రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. గతేడాది నవంబర్‌లో ఇండోనేసియాలోని బాలిలో జరిగిన G 20 సదస్సుకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు బైడెన్ కూడా హాజరయ్యారు.