Manmohan Singh Death: దేశ ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేశారు- ప్రజల జీవితాన్ని మెరుగు పరిచారు- మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని సంతాపం
Manmohan Singh Death: తెలివైన ఆర్థికవేత్తగా మన్మోహన్ సింగ్ దేశ ప్రజలపై చెరగని ముద్రవేశారని ప్రధానమంత్రి సహా బీజేపీ నాయకులంతా సంతాపం తెలియజేశారు.
Manmohan Singh Death: ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మాజీ ప్రధాని మన్మోహన్ (92) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భారతదేశ ఆర్థిక సంస్కరణలు ఆయన దార్శనికతకు నిదర్శనంగా చెబుతారు. భారతదేశానికి ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రుల్లో ఆయన ఒకరు. మృదుస్వభావి, వినయం మరియు వ్యక్తిగతంగా నిజాయితీ గల ప్రధానిగా ఆయనకు పేరుంది. ఆయన పదవీ కాలంలో ప్రభుత్వంపై అనేక అవినీతి కేసులు వెలుగులోకి వచ్చినప్పటికీ వ్యక్తిగతంగా ఆయనపై ఎలాంటి మచ్చ పడలేదు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు." భారతదేశం తన అత్యంత విశిష్ట నాయకుల్లో ఒకరైన డాక్టర్ మన్మోహన్ సింగ్ జీని కోల్పోయినందుకు బాధగా ఉంది. నిరాడంబరమైన మూలాల నుంచి వచ్చిన ఆయన గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగారు. ఆర్థిక మంత్రిగా సహా వివిధ ప్రభుత్వ పదవుల్లో పనిచేశారు, సంవత్సరాలుగా మన ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేశారు. పార్లమెంట్‌లో ఆయన చేసిన చర్చలు కూడా తెలివైనవి. ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆయన విస్తృతంగా కృషి చేశారు." అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
ప్రధాని మోదీ ఇంకా ఇలా రాశారు, "డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ ప్రధానిగా ఉన్నప్పుడు నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా మాట్లాడేవాళ్ళం. మేము పాలనకు సంబంధించిన వివిధ విషయాలపై లోతైన చర్చలు జరిపాము. ఈ దుఃఖ ఘడియలో, మన్మోహన్ సింగ్ జీ కుటుంబానికి, స్నేహితులకు నా సానుభూతి.
డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. "మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణ వార్త చాలా బాధాకరం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ నుంచి దేశ ఆర్థిక మంత్రి, ప్రధాన మంత్రి వరకు డాక్టర్ మన్మోహన్ సింగ్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ దుఃఖ ఘడియలో ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను, ఆయన ఆత్మకు మోక్షం కలగాలని కోరుకుంటున్నాను. అని పోస్టు పెట్టారు.
Also Read: పొలిటికల్ 'పండిట్' మన మన్మోహన్ సింగ్ - దేశ గతిని మార్చిన ఆర్థికవేత్త
కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ పోస్ట్ చేస్తూ, "మాజీ ప్రధాని, గొప్ప ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ మరణవార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణం దేశానికి తీరని లోటు. భారతదేశ ఆర్థిక సంస్కరణలకు ఆయన చేసిన సహకారం చారిత్రాత్మకం. మా నాయకుడు -మా నాన్న గౌరవనీయులైన రామ్‌విలాస్ పాశ్వాన్‌కు కూడా ఆయన మంత్రివర్గంలో పని చేసే అవకాశం లభించింది, ఆయన సరళత, సహనం, నిస్వార్థ సేవకు ఉదాహరణ. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఆయన కుటుంబ సభ్యులకు సవినయంగా నివాళులర్పిస్తున్నాను."