మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis)ను ముంబై పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమయంలో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అతి కష్టమ్మీద ఆయన్ని పోలీసులు జీపులో ఎక్కించుకొని స్టేషన్‌కు తరలించారు. జీపులో పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న టైంలో ఆయన బీజేపీ జెండా ఊపుతూ అభివాదం చేస్తూ కనిపించారు.
ఈడీ కేసుల్లో అరెస్టైన మహారాష్ట్ర మంత్రి మాలిక్(Nawab Malik)ను మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు బీజేపీ లీడర్లను పోలీసులు అరెస్టు చేశారు.
గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయని మనీలాండరింగ్ కేసులో ఎన్‌సీపీ ఎమ్మెల్యే, మంత్రి నవాబ్ మాలిక్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన ఈడీ విచారణలో ఉన్నారు. మార్చి 21 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న మాలిక్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఫడ్నవీస్ గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర శాసనసభలో నిరసనలు చేస్తున్నారు.
కొన్ని రోజుల విచారణ తర్వాత ఫిబ్రవరి 23న మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద ఈడీ కేసు నమోదు చేసింది.
గత కొన్ని నెలలుగా మనీలాండరింగ్ కేసును ఈడీ విచారిస్తోంది. అదే విషయంలో, ఇబ్రహీం, అతని సహాయకుడి రహస్య స్థావరాలపై అది అనేకసార్లు దాడులు నిర్వహించింది.
నవాబ్ మాలిక్ కుమారుడు ఫరాజ్ మాలిక్‌ను కూడా ఈడీ విచారణకు పిలిచింది.
ఫిబ్రవరిలో ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్, అతని సోదరుడు ఇక్బాల్ కస్కర్, అతని బావ సలీం ఫ్రూట్, ఛోటా షకీల్‌ను ఈడీ ప్రశ్నించింది.