అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా అంటే మనం త్వరగా గుర్తుపట్టలేకపోవచ్చు కానీ తెలుగు  మాజీ హీరోయిన్ నవనీత్ కౌర్ అంటే సులువుగా గుర్తుపడతారు. ఆమె ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఇండిపెండెంట్‌గా అమరావతి ఎంపీ సీటులో గెలవడమే కాదు... ఇప్పుడు నేరుగా శివసేననే ఢీ కొడుతున్నారు. మహారాష్ట్ర సీఎం నివాసం అయిన మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠిస్తానని సవాల్ చేశారు. దీనికి కారణం ఉంది.. ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయిన తర్వాత మహారాష్ట్రలో భయానక వాతావరణం పెరిగిందని, అందుకే  "మాతో శ్రీ " ఎదుట హనుమాల్ చాలీసా పఠిస్తానని సవాల్ చేశారు. 


 






నవనీత్ కౌర్ భర్త రవి రానా కూడా ఎమ్మెల్యేనే. ఆయనతో కలిసి హనుమాన్ చాలీసా పఠించేందుకు వెళ్లక ముందే  శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ముంబైలోని వారింటిముందు ఆందోళనకు దిగారు. శివసేనతో పోరాడుతూండటంతో కేంద్రం  ఆమెకు వై కేటగిరి భద్రత కల్పించింది. 


రానా దంపతులకు అధికార శివసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివసేనను సవాల్‌ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, మహారాష్ట్రలో మీరు ప్రశాంతంగా గడపలేరంటూ శివసేన పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ హెచ్చరించారు. 



మరో వైపు సీఎం నివాదం మాతోశ్రీ వద్ద కూడా పెద్ద ఎత్తున శివసైనికులు గుమికూడారు. సీఎం ఇంటివద్ద గలాటా సృష్టించడానికి ఎవరైనా వస్తే ఎలా బుద్ది చెప్పాలో తమకు తెలుసని వారంటున్నారు.