Hardik Patel Joining BJP:  బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటిదార్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన హార్దిక్ పటేల్ చివరికి ఆ పార్టీలోనే చేరనున్నారు. ఆయన పాటిదార్ ఉద్యమంలో పాల్గొన్న సమయంలో దేశద్రోహం కేసులను కూడా బీజేపీ ప్రభుత్వం పెట్టింది. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి అదే పార్టీలో రాజకీయ భవిష్యత్ వెదుక్కోవాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. హార్దిక్ పటేల్ మే 30 లేదా మే 31 న ఇద్దరు కేంద్రమంత్రుల సమక్షంలో  గాంధీనగర్‌లో బిజెపిలో చేరనున్నారు. 


ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తానంటున్న పటేల్ !


 తాను బీజేపీలో ( BJP )  చేరుతున్నానని, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని హార్జిక్ పటేల్ ప్రకటించారు. పార్టీలో చేరిన తర్వాత సోమనాథ్ ఆలయం ( Somnath Temple ) నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు ఏక్తా యాత్రకు నాయకత్వం వహించనున్నారు. భారీ బల ప్రదర్శన ద్వారా బీజేపీలో చేరాలని పటేల్ నిర్ణయించుకున్నారు. హార్దిక్ మే 18న కాంగ్రెస్‌కు ( Cpngress ) వర్కింగ్ ప్రెసిడెంట్‌తో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలో చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.  అయితే మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ప్రశంసించ.డం.. కేజ్రీవాల్ కూడా హార్దిక్ పటేల్‌కు స్వాగతం చెప్పడంతో  ఆయన అటు వైపు మొగ్గుతారేమో అనుకున్నారు. 


ఆప్ ఆహ్వానించినా బీజేపీకే హార్దిక్ ఓటు !


కానీ పాటీదార్లు ( Patidar )ఎక్కువగా బీజేపీ ఓటు బ్యాంక్‌గా ఉన్నారు. అందుకే ఆయన కూడా బీజేపీలోనే చేరాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో తాను ముఖ్యమైన పాత్రను పోషిస్తానని ఇప్పటికే ప్రకటించారు. రానున్న శాసన సభ ఎన్నికలు బీజేపీ (BJP) కి అనుకూలంగా ఏకపక్షంగా జరుగుతాయని కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత పలు సందర్భాల్లో చెప్పారు.  


కాంగ్రెస్‌లో ప్రాధాన్యం దక్కలేదని రాజీనామా !


పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (  PAAS ) ఉద్యమాల ద్వారా వెలుగులోకి వచ్చిన యువనేత.. తర్వాత 2019లో కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యేగా గెలిచారు.  2020లో ఆయన గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.  కానీ పార్టీ హైకమాండ్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. రాజీనామా చేశారు.  ఇప్పుడు బీజేపీలో చేరి అదృష్టం పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు.