Bathinda Military Station: పంజాబ్ లోని బఠిండాలో ఉన్న ఆర్మీ ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. కంటోన్మెంట్ ప్రాంతాన్ని మూసివేశారు. ఈ ఘటన తర్వాత కంటోన్మెంట్ లోకి ఎవరినీ అనుమతించడం లేదు. కంటోన్మెంట్ లో కాల్పులు జరిగాయని, అందులో నలుగురు సైనికులు మరణించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.


ఈ రోజు తెల్లవారుజామున 4.35 గంటలకు బఠిండా మిలిటరీ స్టేషన్ లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురికి గాయాలైనట్లు ఆర్మీ సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. స్టేషన్ క్విక్ రియాక్షన్ బృందాలను రంగంలోకి దింపి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సీల్ చేశారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


ఉగ్రవాద ఘటన కాదు: ఆర్మీ


ఇది ఉగ్రవాద ఘటన కాదని పంజాబ్ సీనియర్ పోలీసు అధికారికి ఆర్మీ చెప్పినట్లు తెలుస్తోంది. 80 మీడియం రెజిమెంట్ ఆర్టిలరీ ఆఫీసర్స్ మెస్ లో కాల్పులు జరిగాయి. కొద్ది రోజుల క్రితం ఈ యూనిట్ లోని గార్డు రూమ్ నుంచి అసాల్ట్ రైఫిల్ కనిపించకుండా పోయింది. అక్కడే ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు మాత్రం ఇంకా తెలియడం లేదు. 


సైన్యం చెప్పిన సమాచారం ప్రకారం ఉగ్రవాద ముప్పు లేదని బఠిండా ఎస్ఎస్పీ గుల్నీత్ ఖురునా తెలిపారు. మిలిటరీ స్టేషన్ అధికారులు బాధితుల గుర్తింపును ఇంకా ధృవీకరించలేదని ఆయన చెప్పారు.