Nitin Gadkari Fastag Annual Pass: భారత ప్రభుత్వం ఫాస్టాగ్ ఇయర్ పాస్ అనే కొత్త విధానం తీసుకొచ్చింది. రూ. 3,000పెట్టి ఈ పాస్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నేషనల్ హైవేలపై ఉన్న రద్దీని తగ్గించేందుకు ఈ విధానం తీసుకొచ్చినట్‌టు కేంద్రం చెబుతోంది. అంతే కాకుండా ఒకేసారి ఏడాదికి పాస్ తీసుకుంటే వాహనదారుడికి కూడా లాభం ఉంటుందని పేర్కొంటోంది. ఈ కొత్త విధానం 15 ఆగస్టు 2025 నుంచి అమల్లోకి రానుంది.
ఏంటీ ఫాస్టాగ్ ఇయర్ పాస్?ఫాస్టాగ్ ఇయర్ పాస్ అనేది ప్రైవేట్ వాహనాల కోసం రూపొందించిన విధానం. జాతీయ రహదారులపై ఉన్న టోల్‌గేట్‌ల వద్ద ఉన్న రద్దీ, ఇతర సమస్యలు తగ్గించేందుకు రూపొందించిన ప్రక్రియ. ఒకసారి రూ. 3,000తో రీఛార్జ్ చేస్తే ఒక సంవత్సరం పాటు వాడుకోవచ్చు. లేదా 200 సార్లు ప్రయాణాల చేసేందుకు కూడా వాడుకోవచ్చు. ఏది ముందు అవుతుందో దాన్ని పరిగణలోకి తీసుకుంటారు.
ఈ ఇయర్ పాస్ తీసుకోవడంతో రోజు వారి పాస్ చెల్లింపులు పూర్తిగా తగ్గిపపోతాయి. అలాంటి వాహనాల కోసం ప్రత్యేకంగా రూట్ క్లియరెన్స్ ఉంటుంది. ఎలాంటి రద్దీ లేకుండా టోల్ స్టేషన్‌ల వద్ద ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా వెళ్లిపోవచ్చు. రహదారిపై రాకపోకలు సులభతరం అవుతుందనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ ప్రక్రియతో జాతీయ రహదారులపై ప్రయాణం మరింత వేగవంతా సులభతరం అవుతుదని అభిప్రాయపడ్డారు.
ఈ పాస్ ఎప్పుడు? ఎలా కొనాలి?ఫాస్టాగ్ ఇయర్ పాస్ 15 ఆగస్టు 2025 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వస్తుంది. రాజ్‌మార్గ్ యాత్ర యాప్ లేదా జాతీయ రహదారి అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), రోడ్డు రవాణా అండ్ రహదారుల శాఖ (MoRTH) అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా ఈ వార్షిక పాస్ కొనుగోలు చేయవచ్చు. ఈ పాస్‌ను కొనేందుకు మీకు ఫాస్టాగ్ ఖాతా, వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఆన్‌లైన్ వెరిఫికేషన్ అవసరం అవుతాయి. కొనుగోలు ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. యాప్‌లో లేదా వెబ్‌సైట్‌లో ఒకసారి లాగిన్ అయిన తర్వాత వాహనానికి సంబంధించిన వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రూ. 3,000 చెల్లించాలి. ఆ తర్వాత మీ ఫాస్టాగ్‌కు ఈ పాస్ అటాచ్ అవుతుంది.
షరతులు వర్తిస్తాయిఈ పాస్ ఒక సంవత్సరం మాత్రమే పని చేస్తుంది. లేదా 200 ట్రిప్‌లు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ రెండింటిలో ఏది ముందు అయితే దాన్నే పరిగణలోకి తీసుకుంటారు. ఒక ట్రిప్ అంటే ఒక టోల్ గేట్‌ను దాటడాన్ని ట్రిప్ అంటారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే మార్గంలో చాలా టోల్ గేట్‌లు ఉంటాయి. అందులో ఒక్కో టోల్‌గేట్ ప్రవేశం నుంచి ఎగ్జిట్ వరకు ఒకే ప్రయాణంగా లెక్కిస్తారు. అంటే ఎన్ని టోల్‌గేట్‌లు దాటితే అన్ని ట్రిప్‌లగా గుర్తిస్తారు. ఇలా 200 ప్రయాణాలు పూర్తైన తర్వాత మళ్లీ రూ. 3,000 చెల్లించి రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పాస్ జాతీయ రహదారుల మీద మాత్రమే పనిచేస్తుంది. రాష్ట్ర రహదారులు లేదా స్థానిక టోల్ గేట్‌ల వద్ద పని చేయదు. అక్కడ కచ్చితంగా టోల్ రుసుములు చెల్లించాలి. ఇది కార్లు, జీపులు, వ్యాన్‌లు వంటి వ్యక్తిగత అవసరాల కోసం నిర్దేశించిన వాహనాలకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ పాస్ మాల్స్, విమానాశ్రయాలు, లేదా పార్కింగ్ స్థలాల్లో పనిచేయదు.
అవుటర్ రింగ్‌రోడ్డుపై పని చేస్తుందా?హైదరాబాద్ అవుటర్ రింగ్‌రోడ్డుపై కూడా టోల్ స్టేషన్‌లు ఉన్నాయి. అక్కడ మాత్రం ఈ ఇయర్ టోల్ పాస్ పని చేయదు. అక్కడ మీరు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పాస్ ఎవరికి ఉపయోగపడుతుంది?రోజూ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ వంటి పెద్ద నగరాల మధ్య ఎక్కువ సార్లు తిరిగే వాళ్లకు యూజ్ అవుతుంది.