Farooq Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై బీజేపీ నాయకులు పైర్ అవుతున్నారు. 85 ఏళ్ల వయస్సులో ఇదేం పని అంటూ మండిపడుతున్నారు. వృద్ధాప్యంలో మహిళలను ఇలాగే ఇబ్బంది పెట్టవచ్చా అని నిలదీస్తున్నారు. ఫరూక్ అబ్దుల్లాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోపై బీజేపీ నాయకులు స్పందిస్తూ.. మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ఆ వీడియోలో ఏముందంటే..


ఫరూక్ అబ్దుల్లాను ఓ మహిళా రిపోర్టర్ ఏదో ప్రశ్నించడానికి ప్రయత్నించారు. ఆమెను ఏమీ మాట్లాడనివ్వకుండా.. ఫరూక్ అబ్దుల్లానే మాట్లాడుతూ.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్? అని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరిన్ని ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టారు. మాజీ సీఎం అలా చేస్తుంటే.. ఏం చేయాలో తెలియక ఆ మహిళా రిపోర్టర్ అలాగే ఉండిపోయారు. ఫరూక్ అబ్దుల్లా అడిగే ప్రశ్నలకు పక్కన ఉన్న వారు కూడా నవ్వుకున్నారు. అంతటితో ఆగి పోలేదు. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరిన్ని ప్రశ్నలు సంధించి మరింత ఇబ్బంది పెట్టారు. అంతేకాదు మధ్య మధ్యలో ఆమె చేతిని తడుముతూ మాట్లాడారు. 






ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు..? నువ్వే నీ భర్తను ఎంపిక చేసుకున్నావా..? మీ తల్లిదండ్రులు చూస్తారా? అని ప్రశ్నలు అడిగారు. ఆమె చేతిని తడుముతూ.. నీ చేతులపై మెహందీ ఎందుకు ఉంది? అని అడిగారు. దాని ఆ మహిళా రిపోర్టరు స్పందిస్తూ.. తన సోదరుడి వివాహం అని చెప్పగా.. అతని భార్య అతడితోనే ఉంటుందా.. లేక వదిలేసి వెళ్తుందా అని కామెడీ చేశారు. నీవు పెళ్లి చేసుకున్నావా? అని ఫరూక్ అబ్దుల్లా మరోసారి ప్రశ్నించారు. దానికి స్పందించిన ఆ మహిళా రిపోర్టర్ నేను చాలా చిన్నదాన్ని సర్..  అని బదులిచ్చారు. దానిపై మళ్లీ స్పందించిన అబ్దుల్లా.. ఎవరిని పెళ్లి చేసుకుంటావో జాగ్రత్త పడు అని అన్నారు. అతడు ఏ మహిళలతో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఎవరికి తెలుసు అదైతే నీకు తెలియకపోవచ్చు అంటూ ఫరూక్ అబ్దుల్లా అక్కడి నుంచి వెళ్లిపోయారు. మహిళలు పని ప్రదేశాల్లో ఎలాంటి ఇబ్బందులకు గురి అవుతారో చెప్పడానికి ఇదో ఉదాహరణ అంటూ అమిత్ మాలవీయా ఈ మొత్తం వీడియో గురించి పోస్టు చేశారు.