Football World Cup Winner అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియానికి చేరుకున్న సమయంలో అంతా అనుకున్నట్లుగా జరగలేదు. అభిమానులు భద్రతా ఏర్పాట్లు, రూల్స్ ఉల్లంఘించి మైదానంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. దాంతో మెస్సీ కేవలం 22 నిమిషాలే స్టేడియంలో ఉండి త్వరగా బయటకు వచ్చారు. పశ్చిమ బెంగాల్ డీజీపీ మాట్లాడుతూ.. GOAT మెస్సీ టూర్ నిర్వాహకులు కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఘటనకుగాను ప్రజల డబ్బును తిరిగి చెల్లిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారని ధృవీకరించారు.
వాటర్ బాటిల్స్ విసిరేసిన మెస్సీ ఫ్యాన్స్
భారీ భద్రత కారణంగా మెస్సీని చూడటం కష్టంగా ఉండటంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల రూపాయల టికెట్ పెట్టి మెస్సీ మ్యాచ్ ను చూడాలని వస్తే తమకు నిరాశే ఎదురైందని మైదానంలో బీభత్సం చేశారు. మెస్సీ సెలబ్రిటీలతో సెల్ఫీలు, ఫొటోలు దిగి వెళ్లిపోవడం చూసిన అభిమానులు బాటిళ్లు, చేతికి దొరికిన వస్తువులను మైదానంలోకి విసిరేయడం ప్రారంభించారు.
పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ ఈ ఘటనపై మీడియాతో మాట్లాడారు. "ప్రధాన నిర్వాహకుడిని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. గోట్ టూర్ సమయంలో జరిగిన ఉద్రిక్తతపై విచారణ చేపట్టాం. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. టికెట్లు కొన్న అభిమానులకు డబ్బు తిరిగి చెల్లిస్తామని నిర్వాహకులు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. చాలా మంది అభిమానులు మెస్సీ ఆడతారని భావించి వచ్చారు. పరిస్థితి ఇప్పుడు అదుపులోకి వచ్చింది. డబ్బు తిరిగి చెల్లిస్తామని నిర్వాహకులు చెప్పారు. దీనికి వారు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు" అని తెలిపారు.
కట్టలు తెంచుకున్న మెస్సీ ఫ్యాన్స్ ఆగ్రహం
దిగ్గజ ఆటగాడు కావడంతో లియోనెల్ మెస్సీకి జడ్ కేటగిరి భద్రతను కల్పించారు. అయితే శనివారం ఉదయం మెస్సీ కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియానికి చేరుకున్నప్పుడు, దాదాపు 70-80 మంది భద్రతా సిబ్బంది ఆయనతో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి అనూప్ బిస్వాస్ సైతం మెస్సీ వెంట ఉన్నారు. అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడం, గోల చేయడం, అరుపులు, కేకల మధ్య ఈవెంట్ నిర్వహించడానికి వీలు లేకుండా పోయింది. పరిస్థితి అదుపుతప్పుతుందని నిర్వాహకులు మెస్సీని అక్కడి నుంచి వెంటనే పంపించేశారు. మ్యాచ్ ఆడకుండా కొద్దిసేపటికే మెస్సీ మైదానం నుండి బయటకు వెళ్లడంతో అభిమానుల కోసం కట్టలు తెంచుకుంది. మైదానంలో వాటర్ బాటిళ్లు విసిరారు. కుర్చీలు విరగ్గొట్టారు. స్టేడియంలో ఏర్పాటుచేసిన నెట్ పీకి పారేశారు. చేతికి దొరికిన వస్తువును దొరికినట్టే ధ్వంసం చేసి హంగామా చేశారు. అనంతరం మెస్సీ ఫ్యాన్స్ కొద్దిసేపటికే భద్రతా ఏర్పాట్లను పట్టించుకోకుండా మైదానంలోకి ప్రవేశించి చాలా గొడవ చేశారు.