మణిపూర్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొందరు మహిళా ఓటర్లు ఈవీఎం మెషీన్లను నేలకేసి కొట్టారు. అయితే ఏ పార్టీకి ఓటు వేసినా, బీజేపీ పార్టీ కమలం గుర్తుకే ఓటు పడుతుందని ప్రజలు ఆగ్రహించి EVM మెషిన్‌లను ధ్వంసం చేశారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది (ఇక్కడ & ఇక్కడ). అసలేం జరిగిందో వాస్తవాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ పోస్ట్ ఇక్కడ చూడండి.
క్లెయిమ్: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మణిపూర్‌లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేసినా, బీజేపీకే ఓటు పడుతుందని ఆగ్రహించి ఓటర్లు ఈవీఎం మెషిన్‌లను నేలకేసి కొట్టిన వీడియో ఇది.
ఫాక్ట్(నిజం): మాణిపూర్ ఖురాయ్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఈ వీడియోలోని ఘటన జరిగింది. అయితే తమ ఓట్లు అంతకు ముందే ఎవరో వేశారని ఎన్నికల అధికారి వారికి చూపించారు. దాంతో ఆగ్రహించిన ఆ మహిళా ఓటర్లు ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఓ పార్టీకి ఓటు వేస్తే మరో పార్టీకి ఓట్లు పడిన ఘటనలు మణిపూర్‌లో ఎక్కడా జరగలేదు. ఆ వైరల్ వీడియోలో చేసిన క్లెయిమ్ నిజం కాదని తేలిపోయింది.
ప్రస్తుతం షేర్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం ఫ్యాక్ట్‌లీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ కీవర్డ్ సెర్చ్ చేసింది. ఈ ఘటనను రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు కనిపించాయి. వాటి ప్రకారం ఆ వైరల్ వీడియోలోని దృశ్యాలు మణిపూర్‌లోని ఖురాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిందని అర్థమవుతోంది.
ఖురాయ్ అసెంబ్లీ సెగ్మెంట్ మొయిరంగకంపు సాజేబ్ ఏరియాలోని ఓ స్కూల్‌లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. కొందరు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చారు. వారి ఓట్లు అంతకు ముందే ఎవరో వేశారని పోలింగ్ అధికారులు తెలపడంతో.. మా ఓట్లు వేరే వాళ్లు ఎలా వేస్తారంటూ మహిళా ఓటర్లు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రంలోని EVMలను ధ్వంసం చేశారని పలు కథనాలు వచ్చాయి. మణిపూర్ లో ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి మరిన్ని వార్తలు ఇక్కడ, ఇక్కడ ఉన్నాయి. ఈ వార్తల్లోనూ కొందరి ఓట్లు అంతకు ముందే వేరే వాళ్లు వేసినట్టు స్పష్టంగా పేర్కొన్నారు. ఏ గుర్తుకు ఓటు వేసినా, బీజేపీ ‘కమలం’ గుర్తుకే ఓటు పడుతుందని ఎక్కడా కనిపించలేదు.
విషయం వైరల్ కావడంతో ఎన్నికల కమిషన్ ఈ బూత్‌లో రిగ్గింగ్ జరిగిందని రీపోలింగ్‌కు ఆదేశించింది. మణిపూర్‌లో పలు పార్టీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని ఓటర్లు అసహనం వ్యక్తం చేశారని వార్తా కథనాలు పేర్కొన్నాయి. కానీ ఒక పార్టీకి ఓటేస్తే వేరే పార్టీకు ఓట్లు పడ్డ ఘటన మణిపూర్ లో ఒక్కటి కూడా రిపోర్ట్ కాలేదు. ఇదే విషయాన్నీ మణిపూర్ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ట్విట్టర్ ఎక్స్ ద్వారా వెల్లడించారు.
చివరగా చెప్పేది ఏంటంటే.. ఏ పార్టీకి ఓటు వేసినా కమలం గుర్తుకే ఓట్లు పడుతున్నాయని ఆ ఈవీఎంలు నేలకేసి కొట్టలేదు, తమ ఓట్లు అంతకుముందే వేరే వాళ్లు వేశారని చెప్పడంతో ఆగ్రహంతో మహిళలు ఈవీఎంలు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు.
This story was originally published by Factly, as part of the Shakti Collective. This story has been edited by ABP Desam staff.