క్లెయిమ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈసారి పోటీ చేస్తున్న రాయ్ బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశాక, అయోధ్యకు వెళ్లి రాముడ్ని దర్శించుకున్నారు. ఆ సమయంలో ప్రజలు మోదీ మోదీ అని గట్టిగా నినాదాలు చేశారు.
ఫ్యాక్ట్(వాస్తవం): ఫిబ్రవరి 2024లో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో జార్ఖండ్‌లోని డియోఘర్‌లోని బాబా బైద్యనాథ్ ధామ్‌లో ప్రార్థనలు చేసినప్పుడు తీసిన వీడియోలను తాజాగా షేర్ చేస్తున్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోగా.. ప్రజలు మోదీ మోదీ అని నినాదాలు చేసినట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత రెండు దశాబ్దాల నుంచి ఆయన తల్లి సోనియా గాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం ఈ ఎన్నికల బరిలోకి రాహుల్ దిగుతున్నారు. మే 3న నామినేషన్ దాఖలు చేసిన తర్వాత రాహుల్ బ్రాహ్మణుడిగా మారిపోయారని నెటిజన్లు ఎద్దేవా చేశారు.
లోక్‌సభ మూడో దశ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మే 5 (ఆదివారం) అయోధ్యలోని బాలరాముడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ప్రధాని మోదీ 2 కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించారు. వైరల్ ట్వీట్ ఆర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ చూడవచ్చు.
న్యూస్ చెకర్ దీనిపై ఫ్యాక్ట్ చెక్ చేయగా.. రాహుల్ గాంధీ ఇటీవల ఏ ఆలయాన్ని దర్శించుకున్నట్లు ప్రముఖ వార్తా సంస్థలు రిపోర్ట్ చేసినట్లు వార్త కనిపించలేదు. దీనిపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా (ఇక్కడ, ఇక్కడ , ఇక్కడ) ఫిబ్రవరి 3, 2024న గుజరాత్ బీజేపీ అధికారిక ఖాతా ద్వారా అప్‌లోడ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ కనిపించింది. దేవగఢ్ లో బాబా వైద్యనాథ్ ధామంలో రాహుల్ గాంధీని చూసిన భక్తులు మోదీ మోదీ అని నినాదాలు చేశారు.
మరిన్ని కీవర్డ్స్ తో సెర్చ్ చేయగా 3, 4 ఫిబ్రవరి 2024లో వార్తలు కనిపించాయి. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ జార్ఖండ్‌లోని దేవఘర్‌లోని బాబా బైద్యనాథ్ ధామ్‌లో ప్రార్థనలు చేశారని ప్రముఖ మీడియా సంస్థలు వార్తలు ఇచ్చాయి.
‘కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఫిబ్రవరి 2న జార్ఖండ్‌కు చేరుకుంది. ఫిబ్రవరి 3న గులాబీ రంగు ధోతీ, నుదుటిపైన గంధంతో రాహుల్ గాంధీ ప్రసిద్ధ జ్యోతిర్లింగంలో ఒకటైన బాబా బైద్యనాథ్ ధామ్‌లో ప్రార్థనలు చేశారు. కొందరు రాహుల్ గాంధీ జిందాబాద్ అని నినాదాలు చేశారు, కానీ వెంటనే ‘మోదీ మోదీ’ అని నినాదాలు చేశారని ఫిబ్రవరి 3, 2024న టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది.
రాయ్‌బరేలీ స్థానం నుంచి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రాహుల్ అయోధ్యకు వెళ్లలేదని ఆ వైరల్ వీడియో అయోధ్యలో రాహుల్ గాంధీ కాదని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ నేతలు నామినేషన్ సందర్భంగా రాహుల్ గాంధీ వెంట వచ్చారు.
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ జార్ఖండ్ లోని దియోగఢ్‌లోని బాబా బైద్యనాథ్ ధామ్‌లో ప్రార్థనలు చేస్తున్న వీడియోను.. రాయ్ బరేలి నుంచి నామినేషన్ తరువాత అయోధ్యకు వెళ్లి పూజలు చేశాడని దుష్ప్రచారం చేస్తున్నారు.
This story was originally published by Newschecker, as part of the Shakti Collective. This story has been translated by ABP Desam staff.