Fact Check: ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్ వేసే సమయంలో ఆయన వెంట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉన్నారంటూ ఓ ప్రచారం జరుగుతోంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఆమె ప్రధాని మోదీతో పాటు వెళ్లారని కొందరు సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ని తెగ వైరల్ చేశారు. ఈ పోస్ట్‌లో ఉన్న ఫొటోలో ప్రధాని మోదీతో పాటు ఆయన వెనకాల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కనిపించారు. ఆమె పక్కనే రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఉన్నారు. ఈ ఫొటో (పోస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) వైరల్ అవుతున్న నేపథ్యంలో అసలు ఇది నిజమా కాదా అని ఫ్యాక్ట్ చెక్ చేసింది Factly టీమ్. పాత ఫొటోని షేర్ చేసి 2024 లోక్‌సభ ఎన్నికల నామినేషన్ నాటి ఫొటో అంటూ ప్రచారం చేస్తున్నట్టు తేలింది. ద్రౌపది ముర్ము 2022లో రాష్ట్రపతి ఎన్నికల సమయంలో నామినేషన్ దాఖలు చేసిన నాటి ఫొటో అని వెల్లడైంది. 



క్లెయిమ్: లోక్‌సభ ఎన్నికలు 2024 కోసం ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేసిన సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన వెంట ఉన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మరీ మోదీతో పాటు వెళ్లారు. 


నిజం: ఈ వైరల్ ఫొటో 2022 జూన్‌లోది. అప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ద్రౌపది ముర్ముని ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆమె వెంట వెళ్లి నామినేషన్ పత్రాలను అధికారికి అందించారు. అసలు ఇప్పటి వరకూ ప్రధాని మోదీ 2024 ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ వేయనే లేదు. ఆయన మే 14వ తేదీన వారణాసిలో నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. కానీ ఇంతలోనే ఆయన నామినేషన్ వేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 






రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫొటో సోర్స్ ఏంటో తెలిసింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేషన్ వేసిన సమయంలో తన X అకౌంట్‌లో ఈ ఫొటో షేర్ చేశారు. ఆమె నామినేషన్ వేస్తున్నట్టుగా ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ సమయంలో పలు వార్తా సంస్థలు ఇదే ఫొటోతో ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. ఈ ఆర్టికల్స్‌ని ఇక్కడ చూడొచ్చు. మొత్తంగా చూస్తే...ఈ ఫొటో నిజమే అయినా ఆ సందర్భం వేరు. ఇప్పుడు ప్రచారం చేస్తుంది వేరు. ఎన్నికల సమయంలో ఇలాంటి ఫేక్ పోస్ట్‌లు చాలానే వైరల్ అవుతుంటాయి. వాటిలో ఏది నిజమో ఏది నిజం కాదో తెలుసుకోకుండానే చాలా మంది ఫార్వర్డ్ చేసేస్తుంటారు. ఈ మధ్యే అమిత్ షా రిజర్వేషన్‌లు రద్దు చేస్తామన్నారంటూ వైరల్ అయిన పోస్ట్ కూడా ఫేక్ అని తేలింది. 




This story was originally published by factly.in as part of the Shakti Collective. This story has been translated by ABPDesam staff.