Vote From Home : ఎన్నికల సంఘం మరో కీలక సంస్కరణ వైపు అడుగులు వేసింది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు కోసం ఇంటి నుంచి ఓటు(Vote For Home) సదుపాయం అమలుచేస్తున్నట్లు ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. ఈ సదుపాయాన్ని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. తొలిసారిగా 80 ఏళ్లు పైబడిన వారికి ఎన్నికల సంఘం ఈ సదుపాయం కల్పించబోతోంది. ఎన్నికల సిబ్బంది ఫారం-12డితో ఓటర్ల వద్దకు వెళ్తాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 80 ఏళ్లు పైబడిన వారు పోలింగ్ కేంద్రానికి రావాలని కోరాతమని, అలా రాలేనివారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.
కర్ణాటక ఎన్నికల్లో అమలు
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు చేస్తుంది ఎన్నికల సంఘం. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ శనివారం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. త్వరలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఓట్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించారు. ‘‘80 ఏళ్ల పైబడిన వారు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలనే మేం కోరుకుంటాం. కానీ అలా రాలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పిస్తాం. ఇంటి నుంచే ఓటు వేసేవారి కోసం ఎన్నికల సిబ్బంది ఫామ్-12డీ తీసుకుని ఓటర్ల వద్దకు వెళ్తాయి. ఈ ఓటింగ్ ప్రక్రియ వీడియో రికార్డ్ చేస్తారు. ఓటర్లు ఓటు వేసే ప్రక్రియను రహస్యంగా ఉంచుతాం. ఇంటి నుంచే ఓటు సేకరించేటప్పుడు ఆ సమాచారాన్ని అన్ని రాజకీయ పార్టీలకు అందిస్తాం "అని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
దివ్యాంగులకు ప్రత్యేక యాప్
దివ్యాంగుల కోసం సాక్షం అనే ఓ యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు సీఈసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ యాప్‌లో లాగిన్ అయి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని ఎంచుకోవచ్చని వెల్లడించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పేపర్లు, అఫిడవిట్లను సమర్పించేందుకు "సువిధ" అనే యాప్‌ను రూపొందించినట్లు ఈసీ తెలిపింది. ఈ యాప్ నుంచి అభ్యర్థులు తమ ప్రచార ర్యాలీలు, సభలకు అనుమతులు కూడా పొందవచ్చని వెల్లడించింది. కర్ణాటక అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. మే 24తో అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. త్వరలోనే ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించే అవకాశాలున్నాయి. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.