Indian Passport Controversy:తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో పాస్‌పోర్ట్ పాత్రపై కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఒక ముఖ్యమైన వివరణ ఇచ్చింది. ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవాలన్న లేదా ప్రస్తుతం వివరాలను సవరించుకోవాలన్నా అవసరమైన 12 రకాల ధృవీకరణ పత్రాలలో పాస్‌పోర్ట్ కూడా ఒకటిగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ వివరణ సాధారణ ఓటర్లకు, కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఎంతో ఊరటనిచ్చే అంశం.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 1967 పాస్‌పోర్ట్ చట్టాన్ని ఉటంకిస్తూ, పాస్‌పోర్ట్ అనేది కేవలం ప్రయాణ పత్రమే కానీ, అది పౌరసత్వానికి నిరూపణ కాదని పేర్కొంది. ఈ ప్రకటన సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. పాస్‌పోర్ట్ ఉన్నప్పటికీ పౌరసత్వం విషయంలో సమస్యలు వస్తాయా? ఓటర్ల జాబితాలో పాస్‌పోర్ట్ ఆధారంగా పేరు నమోదు చేయడం సాధ్యం కాదా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమయ్యాయి. దీంతో ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.
ఎన్నికల సంఘం అధికారుల ప్రకారం, ఓటర్ల జాబితాలో ఒక వ్యక్తి పేరు చేర్చడానికి ఆ వ్యక్తి భారతీయ పౌరుడై ఉండటం, నిర్ణీత వయసు కలిగి ఉండటం ప్రాథమిక సూత్రం. దీనిని నిరూపించడానికి ఓటరు నమోదు అధికారి కొన్ని పత్రాలను పరిశీలిస్తారు. ఈ పత్రాల జాబితాలో పాస్‌పోర్ట్ ఎప్పటి నుంచో ఉంది. అది అలాగే కొనసాగుతుంది. " పాస్‌పోర్ట్ అనేది ఒక వ్యక్తి గుర్తింపును, నివాసాన్ని ధృవీకరించే కీలక పత్రం. ఇందులో ఎలాంటి మార్పు లేదు" అని ఒక ఉన్నతాధికారి స్పష్టం చేశారు.
చారిత్రక ఆధారాలు, గత అనుభవాలు
గతంలో బిహార్‌లో జరిగిన SIR, అసోంలో జరిగిన ప్రత్యేక సవరణలు, ఆ తర్వాత జరిగిన వివిధ దశల ఓటర్ల జాబితా సవరణలలో కూడా పాస్‌పోర్ట్‌ను ఒక ప్రామాణిక పత్రంగానే పరిగణించారు. గత 12 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి కొత్త విధానాన్ని తీసుకురాలేదని, పాత పద్ధతులే అమల్లో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అంటే దశాబ్ద కాలంగా పాస్‌పోర్ట్ అనేది ఓటరుగా నమోదు కావడానికి ఒక నమ్మదగిన ఆధారంగా ఉంటూ వస్తోంది.
పౌరసత్వం vs గుర్తింపు పత్రం
చట్టపరంగా చూస్తే పాస్‌పోర్ట్ అనేది ఒక వ్యక్తి భారత వెలుపలికి వెళ్లడానికి లేదా తిరిగి రావడానికి ఇచ్చే ప్రయాణ పత్రం. అయితే ఓటర్ల జాబితా తయారీ సమయంలో , సదరు వ్యక్తి వివరాలను సరిచూడటానికి అధికారులు కోరే 12 పత్రాలలో ఇది ఒకటి. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దరఖాస్తుదారు సమర్పించిన ఈ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఓటు హక్కుపై నిర్ణయం తీసుకుంటారు.
ప్రజలు గమనించాల్సిన అంశాలు...
ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసేటప్పుడు పాస్‌పోర్ట్ మాత్రమే కాకుండా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి మరో 11 పత్రాలను కూడా ప్రభుత్వం అనుమతిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్నికల సంఘం కానీ పాస్‌పోర్ట్ ప్రాముఖ్యతను తగ్గించే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఓటరు నమోదు ప్రక్రియలో దరఖాస్తుదారు పత్రాలను అంగీకరించే పూర్తి అధికారం సంబంధిత అధికారులకు ఉంటుంది. పాస్‌పోర్ట్ సమర్పించినప్పుడు దాన్ని నిరాకరించడానికి వీలులేదని తాజా వివరణ ద్వారా స్పష్టమవుతుంది.
