National Herald Case: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు జులై 21న హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం.






కరోనా వల్ల


ఈ కేసులో జూన్​ 8నే సోనియా గాంధీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే జూన్​ 2న సోనియా గాంధీకి కరోనా సోకింది. దీంతో కొన్నిరోజులు ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత పోస్ట్‌ కొవిడ్ కారణాల వల్ల జూన్​ 12న ఆస్పత్రిలో చేరారు. కరోనాతో బాధపడుతున్న కారణంగా విచారణకు హాజరుకాలేనని మూడు వారాల గడువు ఇవ్వాలని సోనియా ఈడీని కోరారు.


దీంతో జూన్​ 23న త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాలని ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. అయితే పూర్తిగా కోలుకున్న తర్వాతే హాజరవుతానని ఆమె మరోసారి చెప్పడంతో తాజాగా జులై 21న రావాలని నోటీసులు ఇచ్చింది.


ఇదీ కేసు


కాంగ్రెస్ పార్టీ, గాంధీలతో ముడిపడిన నేషనల్ హెరాల్డ్ కేసు ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐ) తమ అధీనంలోకి తెచ్చుకోవడం వెనుక మోసం, కుట్ర వంటి ఆరోపణలు ఉన్నాయి. 2010లో ఏజేఎల్ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి రావడంతో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐఎల్) కంపెనీ దానిని టేకోవర్ చేసింది. దానికి డైరెక్టర్లుగా ఉన్న సుమన్ దుబే, టెక్నోక్రాట్ శామ్ పిట్రోడాలకు గాంధీ విధేయులుగా పేరుంది.


ఈ కేసుపై సుబ్రహ్మణ్య స్వామి దిల్లీ హైకోర్టులో గతంలో ఫిర్యాదు చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కాంగ్రెస్‌ పార్టీకి బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకొనే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్‌ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఇందులో సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ సహా ఏడుగురిని పేర్లను చేర్చారు. వీరిలో ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడా‌ తదితరులు ఉన్నారు.


Also Read: Parliament Of India: నూతన పార్లమెంట్‌పై 6.5 అడుగుల జాతీయ చిహ్నం- ఆవిష్కరించిన ప్రధాని


Also Read: Goa Political News: మహారాష్ట్రలో ముగిసింది, గోవాలో మొదలైంది- ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఆఫర్!