National Herald Case: ఢిల్లీలోని నేనల్ హెరాల్డ్ ఆఫీసును ఈడీ సీజ్ చేసింది. ఆ పత్రికకు సంబంధించిన 12 ప్రదేశాల్లో రెండు రోజులుగా ఈడీ ఆఫీసర్లు తనిఖీలు చేశారు. మనీల్యాండరింగ్ కేసుతో నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని అటాచ్ చేశారు. హెరాల్డ్ హౌజ్‌లో నాలుగవ అంతస్తులో నేషనల్ హెరాల్డ్ పబ్లికేషన్ ఆఫీసు ఉంది. రెండు రోజుల పాటు సోదాలు చేసిన తర్వాత నేషనల్ హెరాల్డ్ కార్యాలయాలను సీజ్ చేస్తున్నట్లుగా ఈడీ ప్రకటించారు. ఇది నేషనల్ హెరాల్డ్-ఏజేఎల్ ఆస్తులకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం. ఇటీవలే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ప్రశ్నించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED ).
నేషనల్ హెరాల్డ్ పత్రికలో ఆర్థిక ఉల్లంఘనలు జరిగాయని, భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యన్ స్వామి 2013లో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజెఎల్)కు చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రికలో మనీల్యాండరింగ్ జరిగిందని, ఈ సంస్థను సోనియా, రాహుల్ గాంధీలు మేజర్ షేర్లు కలిగి ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కట్టబెట్టడం జరిగిందని స్వామి ఆరోపించారు. రూ. 50 లక్షల పెట్టుబడితో గాంధీలు రూ. 90.25కోట్ల ఏజెఎల్ ను స్వాధీనం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ పిటిషన్ ఆధారంగా ఈడీ కేసులు నమోదు చేసి విచారణ జరుపుతోంది.
ఈడీ రెయిడ్స్ పేరుతో కక్ష సాధింపునకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. ప్రధాన ప్రతిపక్షంపై జరుగుతున్న నిరంతర దాడుల్లో భాగమే ఈ చర్య అని మండిపడింది. ‘‘మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని అందులో భాగంగానే వేధిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అసలు ఈ కేసులో నగదు లావాదేవీలే జరగనప్పుడు.. మనీ ల్యాండరింగ్ ఎలా జరుగుతుందని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.