Sanjay Raut: శివసేన ఎంపీకి ఈడీ షాక్- 1000 కోట్ల విలువైన భూ కుంభకోణంలో ఆస్తులు సీజ్

ABP Desam Updated at: 05 Apr 2022 07:38 PM (IST)
Edited By: Murali Krishna

మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. పత్రచాల్ కేసులో భాగంగా ఈ చర్యలు చేపట్టింది.

శివసేన ఎంపీకి ఈడీ షాక్- 1000 కోట్ల విలువైన భూ కుంభకోణంలో ఆస్తులు సీజ్

NEXT PREV

శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్ సహా ముగ్గురి రూ.11.15 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.


జప్తు చేసిన ఆస్తుల్లో రూ. 9 కోట్లు విలువ చేసే అలీబాగ్‌లోని 8 స్థలాలతో పాటు ముంబయిలోని దాదార్‌ శివారులో ఉన్న రూ. 2 కోట్ల విలువైన ఓ ఫ్లాట్‌ ఉన్నాయి. ముంబయిలోని పత్రచాల్ రీ-డెవలప్‌మెంట్‌కు సంబంధించి రూ.1,034 కోట్ల విలువైన భూ కుంభకోణం కేసులో భాగంగా ఈ జప్తు జరిగినట్టు ఈడీ పేర్కొంది.


అరెస్ట్


ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త ప్రవీణ్ రౌత్​ను ఫిబ్రవరిలోనే అరెస్టు చేసింది ఈడీ. అనంతరం ఛార్జ్​షీట్ కూడా దాఖలు చేసింది. మరో మనీలాండరింగ్ కేసు పీఎంసీ బ్యాంక్​ మోసానికి సంబంధించి సంజయ్ రౌత్ సతీమణి వర్షా రౌత్​ను గతేడాదే ప్రశ్నించింది ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​. ప్రవీణ్​ రౌత్ భార్య మాధురితో వర్షాకు ఉన్న సంబంధాలపై ప్రశ్నలు సంధించింది. 


ఇదే కేసు


2007లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం పత్రచాల్‌ ప్రాంతంలో 3వేల ఫ్లాట్లు నిర్మించడానికి గురుఆశీష్ కన్‌స్ట్రక్షన్స్‌కు 1034 కోట్ల విలువైన ప్రాజెక్ట్ కేటాయించింది. ఇందుకోసం 47 ఎకరాల భూమిని ఈ కంపెనీకి అప్పగించింది. గురుఆశీష్ కన్‌స్ట్రక్షన్స్‌ డైరెక్టర్లలో ఒకరైన ప్రవీణ్‌ రౌత్‌.. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు అత్యంత సన్నిహితుడు. ప్రవీణ్ రౌత్ భార్య మాధురి సంజయ్‌ రౌత్ సతీమణి వర్షకు 55 లక్షలు వడ్డీలేని రుణం ఇచ్చినట్టు ఈడీ విచారణలో తేలింది. అంతేకాక, మాధురి, వర్షా  కలిసి ఆలీబాగ్‌లో ఓ భూమి కూడా కొనుగోలుచేశారు. ఈ ల్యాండ్ డీల్‌పైనా ఈడీ కూపీ లాగుతోంది. ఈ నేపథ్యంలో రౌత్ ఆస్తులు అటాచ్ చేసింది. 


భయపడను


ఈడీ తన ఆస్తులు జప్తు చేయడంపై సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు.







నా ఆస్తులు జప్తు చేయండి, కాల్పులు జరపండి, జైలుకు పంపండి,  ఏమాత్రం భయపడను. నేను బాలాసాహెబ్ ఠాక్రే అనుచరుడిని, నిజమైన శివసైనికుడిని. అతను పోరాడతాడు, ప్రతి ఒక్కరి వ్యవహారం బయటపెడతాడు. చూస్తూ కూర్చునే రకం కాదు. వాళ్లను డాన్స్ చేయనీయండి. చివరికి నిజమే గెలుస్తుంది.                                                             -  సంజయ్ రౌత్, శివనసే ఎంపీ



 

Published at: 05 Apr 2022 07:38 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.