Earthquake In India: దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ఆందోళనకు గురి చేశాయి. మంగళవారం (జూన్ 13) మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జమ్మూ కశ్మీర్ లోని దోడాలో భూకంపం ఆందోళనకు గురి చేసింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4 గా నమోదు అయింది. దోడాలోని గందో భలేసా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో 30 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంప ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ - ఎన్‌సీఆర్(నేషనల్ క్యాపిటర్ రీజియన్), పంజాబ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో భూమి కంపించింది. ఢిల్లీలో దాదాపు 10 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. జమ్మూ కశ్మీర్ లో రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో భూమి కంపించగా, ఢిల్లీలో 4.0 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. మణిపూర్ లో సైతం 10 సెకన్ల పాటు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఇక్కడ రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రత నమోదు అయింది. 






మంగళవారం మధ్యాహ్నం దోడా, కిష్తవార్ జిల్లాలో 5.4 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ డైరెక్టర్ ఓపీ శర్మ తెలిపారు. దీని ప్రకంపనలు హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లలో కనిపించింది. దోడాలో సంభవించిన ప్రధాన భూకంపం తర్వాత ఆయా రాష్ట్రాల్లో తేలికపాటి ప్రకంపనలు నమోదు అయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ డైరెక్టర్ ఓపీ శర్మ తెలిపారు. 






జమ్మూ కశ్మీర్ లో సంభవించిన భూకంపంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాలు, దుకాణాల నుంచి జనం రోడ్ల మీదకు పరుగులు తీశారు. పాఠశాలల్లో తరగతి గదులను ఉపాధ్యాయులు ఖాళీ చేయించారు. తక్షణమే విద్యార్థులు అందరినీ బయటకి పంపించారు. 


దోడా, కిష్తవార్, పంజాబ్ లోని లుధియానా, రోపర్, జలంధర్, అమృత్ సర్, సిమ్లా వంటి ప్రాంతాల్లో భూమి కంపించింది. భూ ప్రకంపనలతో కొన్ని చోట్ల భవనాలకు బీటలు వారాయి. కొన్ని చోట్ల భవనాలు కూలినట్లు సమాచారం. భూకంపం ప్రభావంతో వణికిపోయిన భవంతులను కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటి వరకైతే ఎలాంటి సమాచారం అందలేదు.