Delhi NCR Earthquake:


ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రాత్రి 11 గంటల 32 నిమిషాలకు భూకంపం సంభవించింది. రాత్రివేళ కావడంతో ప్రజలు నిద్రపోతున్న సమయంలో భూమి కంపించడంతో హడలెత్తిపోయారు. ఢిల్లీ రాజధాని చట్టుపక్కల ప్రాంతాలు, బిహార్ ప్రజలు భూ ప్రకంపనలు రావడంతో భయంతో ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.


నేపాల్ లోనూ పలుచోట్ల భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. నేపాల్ లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9 గా నమోదైందని అధికారులు భావించారు. అయితే 6.4 తీవ్రతతో నేపాల్ కేంద్రంగా భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు తెలిపారు. నేపాల్ లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదు అయినట్లు సమాచారం. గత నెల నుంచి కొన్ని రోజుల వ్యవధిలో సంభవించిన మూడో అతిపెద్ద భూకంపం ఇది. అయితే నిద్ర పోవడానికి అప్పుడే మంచం మీద పడుకున్న కొందరికి అసలు ఏమైంది అనేది అర్థం కావడానికి కొంత టైమ్ పట్టిందని ఢిల్లీ వాసులు చెబుతున్నారు.






నోయిడాకు చెందిన తుషార్ అనే యువకుడు ఏఎన్ఐతో మాట్లాడుతూ.. తాను టీవీ చూస్తుండగా భూకంపం వచ్చిందని వార్త చూసినట్లు తెలిపారు. సరిగ్గా అదే సమయంలో ఇంట్లో వస్తువులు, ఫ్యాన్ ఊగుతున్నట్లు గమనించి వెంటనే ఇంటి నుంచి బయటకు పరుగులు తీశానని తెలిపాడు. కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వారిని సైతం అప్రమత్తం చేసినట్లు చెప్పుకొచ్చాడు. చుట్టుపక్కల వారు సైతం భూకంపం రావడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారని చెప్పాడు.







బిహార్ లోనూ పలుచోట్ల భూమి కంపించింది. ఓ యువకుడు ఏఎన్ఐతో మాట్లాడుతూ.. తాను నిద్రపోవడానికి రెడీగా ఉన్నానని, అదే సమయంలో ఫ్యాన్ ఊగడం చూసి తనకు భూకంపం వచ్చినట్లు అర్థమైందన్నాడు. ఇంట్లో వస్తువులు కదులుతున్నాయని, భయంతో ఇంటి నుంచి భయటకు వచ్చేశానని తెలిపాడు. తాను అప్పుడే మంచంపై పడుకున్నానని, బెడ్ కదులుతున్నట్లు గమనించి, భూకంపం వచ్చిందని అర్థమై వెంటనే ఇంటి నుంచి వీధిలోకి పరుగులు తీశానని మరో వ్యక్తి చెప్పాడు.






తరచుగా భూకంపాలు.. 
అక్టోబర్ 3న సైతం ఢిల్లీ- ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లతో పాటు నేపాల్ లో భూప్రకంపనలతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా నేపాల్ లో రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ లో పలుచోట్ల దాదాపు 10 సెకన్ల పాటు భారీగా భూప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.


అక్టోబర్ 22న సైతం నేపాల్ లో భారీ భూకంపం సంభవించడం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ నాల్గవ భూకంప జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతం భూకంపాలకు గురయ్యే అధిక రిస్క్ జోన్లలో ఒకటి. అయితే నేపాల్ కేంద్రంగా 5 కిలోమీటర్ల లోతులో భూకంప తీవ్రత ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.