EAM Jaishankar |బ్రస్సెల్స్: ఉగ్రవాదంతో పాటు అణ్వస్త్రాలతో బెదిరింపులపై జీరో టోలరెన్స్ ఉండాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. యూరప్‌లో అధికారిక పర్యటనలో ఉన్న జైశంకర్.. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దాయాది పాకిస్తాన్‌ను 'టెర్రరిస్తాన్' అని సంబోధించారు. ఉగ్రవాదులకు ఆవాసం కనుక ఆ దేశాన్ని టెర్రరిస్తాన్ అనడంలో ఏ తప్పు లేదన్నారు. ఉగ్రవాదం అనేది కేవలం భారతదేశం, పాకిస్తాన్ మధ్య కానే కాదని, ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పుగా అభివర్ణించారు. ఉగ్రదాడులకు అవకాశం లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే భారత బలగాలు పాకిస్తాన్, PoJK లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ ద్వారా దాడిచేశాయన్నారు.
బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో యూరోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాలు, భద్రతా విధానానికి హై రిప్రజెంటేటివ్ కజా కల్లాస్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ: “టెర్రరిజం అనేది రెండు దేశాల మధ్య వివాదం కాదు. ఇది వాస్తవానికి ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పు. కనుక మీరు దీన్ని ఇండియా-పాకిస్తాన్ మధ్య వివాదంలా కాకుండా ‘ఇండియా-టెర్రరిస్తాన్’ మధ్య వివాదంగా భావించాలని కోరారు.
ఉగ్రవాదంపై అంతర్జాతీయ సహకారం కోరారు. పలు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ప్రజల్లో అవగాహనను మరింత పెంచాలని జైశంకర్ కోరారు. అణ్వస్త్ర బెదిరింపులకు ప్రపంచ సమాజం ఎప్పుడూ లొంగకూడదని, ఉగ్రవాదంపై పోరాటంలోనూ వెనకడుకు వేయకూడదని ఆయన అన్నారు.
"ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిపై భావవ్యక్తీకరణలోనూ ఎలాంటి సహనం అవసరం లేదని మేం గట్టిగా నమ్ముతున్నాం. పాక్ లాంటి దేశాలు చేసే అణ్వస్త్ర బెదిరింపులకు ఎప్పుడూ లొంగకూడదు. ఇది ప్రపంచ సమాజానికి పొంచి ఉన్న ముప్పు. కనుక ఉగ్రవాదం లాంటి విషయాల్లో భారత్‌కు అంతర్జాతీయ సహకారంతో పాటు ఆయా దేశాలకు అవగాహన ఉండటం చాలా అవసరం" అని జైశంకర్ అన్నారు.
ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రవాద దాడిలో ఓ నేపాలీ సహా 26 మంది మరణించారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాక్, పీఓకేలో ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసింది. ఆపై పాక్ సరిహద్దుల్లో భారత్ మీద డ్రోన్ దాడులు చేసింది. భారత బలగాలు పాక్ నుంచి వచ్చిన డ్రోన్లు, ఫైటర్ జెట్లను వచ్చినవి వచ్చినట్లు గాల్లోని పేల్చేసి పాక్ కుయుక్తులను తిప్పి కొట్టాయి.
పాకిస్తాన్ అనేది ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తుంది. మేం ఉగ్రవాదాన్ని సంహించం. "వారు ఎక్కడ ఉన్నా మాకు అనవసరం. వారు పాకిస్తాన్‌లో మరింత దూరంగా ఉంటే, మేము పాకిస్తాన్‌లో అంత లోతుగా వెళ్లి ఉగ్రవాదుల్ని ఏరివేస్తాం. సంఘర్షణకు మూల కారణాలు మారలేదు. ఉగ్రవాదులకు పాక్ ఆవాసంగా మారిందని జైశంకర్ వ్యాఖ్యానించారు.