Rajyasabha Elections: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు.  కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర నేతలతో కలిసి జైపూర్ వెళ్లి నామినేషన్ సమర్పించారు. ఈ సందర్బంగా ఎన్నికల సంఘానికి నామినేషన్ పత్రాలతో పాటు తన ఆస్తులు, కేసులకు సంబంధించిన వివరాలతో అఫిడవిట్ సమర్పించారు. ఈ అఫిడవిట్‌లో సోనియా ఆస్తులకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విదేశాల్లోని ఆమె ఆస్తుల వివరాలు బయటకొచ్చాయి.


సోనియా ఆస్తుల విలువ ఇలా.. 
సోనియా ఆస్తుల విలువ మొత్తం రూ. 12 కోట్లుగా ఉన్నట్లు అఫిడవిట్‌లో ఉంది. అలాగే ఇటలీలో తనకు ఉన్న ఇంటి వివరాలను సోనియా ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపర్చారు. తనకు వారసత్వంగా ఇల్లు వచ్చిందని, ఈ ఇంటి విలువ ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం రూ.27 లక్షలుగా ఉందని తెలిపారు. 2014లో ఇంటి విలువ రూ.19.9 లక్షలుగా ఉందని అఫిడవిట్‌లో పేర్కొనగా.. ఇప్పుడు మరింత పెరిగింది. అలాగే అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం.. సోనియా గాంధీ వద్ద రూ.కోటి విలువైన ఆభరణాలు ఉండగా.. బ్యాంకు డిపాజిట్లు, బాండ్లు, పెట్టుబడులు, రాయల్టీ ద్వారా వచ్చే ఆస్తుల విలువ రూ.6.38 కోట్లుగా ఉన్నట్లు స్పష్టం చేశారు. వీటి ద్వారా వచ్చే వడ్డీ, ఎంపీగా వచ్చే జీతమే తన ఆదాయ వనరని అఫిడవిట్‌లో సోనియా పేర్కొన్నారు.


సొంత కారు లేదు 
2014 అఫిడవిట్ ప్రకారం సోనియా సంపద మొత్తం రూ.9.28 కోట్లుగా ఉండగా.. 2019లో రూ.11.82 కోట్లకు పెరిగింది. ఇప్పుడు 12 కోట్ల 53 లక్షల 76 వేల 822 రూపాయలుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక తనకు సొంత కారు లేదని తెలిపారు. ఢిల్లీలోని డేరా మండి గ్రామంలో వ్యవసాయం భూమి ఉందని, ప్రస్తుతం తన వద్ద రూ.90 వేల నగదు ఉన్నట్లు పొందుపర్చారు. 88 కేజీల వెండి, 1,267 గ్రాముల బంగారం ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇక తనపై ఉన్న కేసుల వివరాలను కూడా సోనియా తెలిపారు. ఏ క్రిమినల్ కేసులోనూ తాను దోషిగా లేనని స్పష్టం చేసిన ఆమె.. తనకు ఎలంటి సోషల్ మీడియా అకౌంట్ లేదని స్పష్టం చేశారు. ఇక విద్యార్హతలకు సంబంధించి 1964లో సియానాలోని ఇస్టిటుటో శాంటా థెరిసాలో ఇంగ్లీష్, ఫ్రెంచ్‌ భాషల్లో మూడు సంవత్సరాల కోర్సు, 1965లో కేంబ్రిడ్జ్‌లోని లెనాక్స్ కుక్ స్కూల్‌లో ఇంగ్లీష్‌లో సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసినట్లు సోనియా అఫిడవిట్‌లో పొందుపర్చారు.


కాగా దేశవ్యాప్తంగా ఖాళీ అయిన 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరిలో షెడ్యూల్ విడుదల చేయగా.. ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల ప్రక్రియ మగియగా.. ఈ నెల 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు కౌంటింగ్ జరగనుంది. లోక్‌సభ ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగనున్న విషయం తెలిసిందే. అంతకంటే ముందు జరుగుతున్న ఈ రాజ్యసభ ఎన్నికలతో రాజకీయ వేడి పెరిగింది. సోనియా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది.