Congress Bank Accounts Frozen: కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాల్ని స్తంభింపజేయడం ఒక్కసారిగా అలజడి సృష్టించింది. తమను కావాలనే టార్గెట్ చేసి ఐటీ శాఖ ఇలా ఆంక్షలు విధించిందని మండి పడింది కాంగ్రెస్ పార్టీ. ట్యాక్స్ ట్రిబ్యునల్‌లో (Tax Tribunal) న్యాయ పోరాటం చేసింది. మొత్తానికి ఈ పోరాటంలో కాస్త ఊరట లభించింది. ఖాతాలు ఫ్రీజ్ అయినప్పటికీ వాటిని పార్టీ వినియోగించుకోవచ్చని ట్రిబ్యునల్ వెల్లడించింది. ఆ ఖాతాలపై ఐటీశాఖకు న్యాయపరమైన హక్కులు మాత్రమే ఉంటాయని, వాటిని ఆపరేట్ చేసుకోడానికి ఎలాంటి ఆంక్షలు ఉండవని తేల్చి చెప్పింది. ఈ తీర్పు ఇవ్వక ముందు కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసింది. లోక్‌సభ ఎన్నికల ముందు కావాలనే ఇలా చేశారమని మండి పడింది. చేతిలో చిల్లిగవ్వ లేదని, ప్రచారానికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించింది. ఈ మేరకు కాంగ్రెస్ ట్రెజరర్ అజయ్ మకేన్ మీడియాకి అన్ని వివరాలు వెల్లడించారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారంటూ మండి పడ్డారు. అకౌంట్‌లు ఫ్రీజ్ చేయడమే కాకుండా రూ.210 కోట్ల పన్ను కట్టాలని ఐటీ డిమాండ్ చేస్తోందని తెలిపారు. ఇది రాజకీయ కక్షేనని ఆరోపించింది. కావాలనే కుట్రపూరితంగా ఇలాంటివి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ప్రస్తుతం మా దగ్గర చిల్లిగవ్వ లేదు. సిబ్బందికి జీతాలివ్వలేం. కరెంట్ బిల్ కట్టడానికి కూడా డబ్బుల్లేవు. ఇలా బ్యాంక్ ఖాతాల్ని ఉన్నట్టుండి నిలిపేస్తే అన్నింటిపైనా ప్రభావం పడుతుంది. కేవలం భారత్ జోడో న్యాయ్ యాత్రపైనే కాదు. మిగతా వ్యవహారాలన్నీ ఆగిపోతాయి"
- అజయ్ మకేన్, కాంగ్రెస్ ట్రెజరర్
ఐటీ శాఖ ఆ ఖాతాల్ని స్తంభింపజేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ Income Tax Appellate Tribunal ని ఆశ్రయించింది. పార్టీ తరపున రాజ్యసభ ఎంపీ, లాయర్ వివేక్ తన్‌ఖా వాదించారు. పార్టీ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఉన్నట్టుండి ఆపేశారని ట్యాక్స్ ట్రిబ్యునల్ బెంచ్ ముందు వెల్లడించారు. ఇలా అయితే...లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతుందని తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్...ఆ ఖాతాల్ని వాడుకోవచ్చని సానుకూలంగా తీర్పునిచ్చింది.
ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి చెప్పింది. ఆర్టికల్ 19(1)(ఏ)తో పాటు సమాచార హక్కు చట్టానికి ఇవి విఘాతం కల్గిస్తున్నాయని స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. నల్లధనం నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం కాదని వెల్లడించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకోకి దారి తీస్తుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఇది కచ్చితంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్‌లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై విచారణ పూర్తైన సందర్బంగా ఈ తీర్పు వెలువరించింది. ఈ బాండ్స్‌ని విక్రయించకూడదని ఆదేశించింది. విరాళాలిచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదని మందలించింది. ఎన్నికల కమిషన్, SBI తమతమ వెబ్‌సైట్‌లలో ఈ వివరాలు పొందుపరచాలని తేల్చి చెప్పింది ధర్మాసనం. పార్టీలకు వచ్చిన నిధులు ఎవరు ఇచ్చారో తెలియాలని వెల్లడించింది. ఈ తీర్పు వచ్చిన మరుసటి రోజే కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్ అవడం సంచలనమైంది.