India-Pakistan DGMO-Level Talks: భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పులు ఉండకూడదని దూకుడు చర్యలకు అడ్డుకట్ట వేయాలని 2025 మే 12 సాయంత్రం 5 గంటలకు జరిగిన DGMOల చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు. ఇరుపక్షాలు నుంచి ఒక్క బులెట్ కూడా సరిహద్దులు దాటడానికి లేదని ఒకరిపై ఒకరు దూకుడుగా, శత్రుత్వం పెంచుకునే చర్యలు చేపట్టకూడదని తీర్మానించారు. ఇదే కంటిన్యూ అయ్యేలా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. సరిహద్దులు, దానికి ఆనుకొని ఇతర ప్రాంతాల నుంచి బలగాలు వెనక్కి రప్పించడంపై కూడా మాట్లాడుకున్నారు. చర్చల సారాంశాన్ని భారత్ ఆర్మీ తన అధికారిక ట్విట్టర్‌లో పెట్టింది.
ఆపరేషన్ పహల్గామ్ తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించిన రెండు రోజుల తర్వాత, సోమవారం సాయంత్రం భారతదేశం, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOలు) సమావేశం జరిగింది. భారత సైన్యం DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్తాన్ ఆర్మీ DGMO మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న హాట్‌లైన్ ద్వారా డిస్కషన్స్ జరిగాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించబోమని తప్పులు ఇకపై జరగవని పాకిస్తాన్ సైన్యం నుంచి ఎలాంటి దూకుడు చర్యలు ఉండవని పాకిస్తాన్ DGMO తెలియజేసినట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి.
చర్చల సమయంలో పాకిస్తాన్ బాడీ లాంగ్వేజ్ చాలా డిఫెన్స్ మోడ్‌లో ఉందని అధికారులు అంటున్నారు. అందుకే పాకిస్తాన్ దూకుడుగా వెళ్లేందుకు అవకాశం లేదనే చర్చ నడుస్తోంది. శనివారం నాడే చివరిగా భూమిపై, గాలిలో, సముద్రంలో అన్ని ప్రాంతాల్లో కాల్పులు జరపకూడదని భారతదేశం పాకిస్తాన్ ఓ ఒప్పందానికి వచ్చాయి.