Air India: ఎయిరిండియాలో కొన్ని అంశాల్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లోపాలు గుర్తించింది. ఈ మేరకు ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెబుతూ ఎయిరిండియాపై కఠిన చర్యలు తీసుకుంది. ఎయిరిండియాకు డీజీసీఏ కఠిన సందేశం పంపించింది. ఫ్లైట్ సేఫ్టీ చీఫ్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నెల రోజుల పాటు సస్పెన్షన్ వేటు విధించింది. 


జులై 25, 26 తేదీల్లో డీజీసీఏ ఎయిరిండియాలో తనిఖీలు నిర్వహించింది. అంతర్గత ఆడిట్, ప్రమాద నివారణ, తగినంత మంది సాంకేతిక నిపుణులు వంటి అంశాల్లో ఎయిరిండియా ఏ మేరకు నిబంధనలు పాటిస్తుందో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషనన్ పరిశీలించింది. ప్రమాదాల నివారణ విషయంలో కొన్ని లోపాలను గుర్తించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పేర్కొంది. అలాగే ఎయిరిండియాలో సాంకేతిక నిపుణుల సంఖ్య కూడా నిబంధనలకు అనుగుణంగా లేదని డీజీసీఏ వెల్లడించింది. అలాగే ఎయిరిండియా అంతర్గతంగా చేపట్టాల్సిన కొన్ని తనిఖీల్లో కూడా కంపెనీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు గుర్తించింది. దీనిపై ఎయిరిండియాకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 


డీజీసీఏ పంపిన నోటీసులపై ఎయిరిండియాలోని ాయా విభాగాల అధిపతులు స్పందిచారని పేర్కొంది. వాటిని సమీక్షించినట్లు తర్వాత ఎయిరిండియా సేఫ్టీ చీఫ్ పై నెల రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేసినట్లు డీజీసీఏ వెల్లడించింది. ప్రయాణికుల భద్రతకు డీజీసీఏ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా గతంలో ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 


విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ ఓపెన్..


ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తున్న ఇండిగో విమానంలో ఊహించని ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఓ ప్రయాణికుడు అనాలోచిత చర్యతో మిగతా ప్రయాణికులంతా భయంభయంగా గడపాల్సి వచ్చింది. ఒక్కరు చేసిన పనికి మిగతా ప్రయాణికుల్లో కలకలం రేగింది. మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి బయల్దేరిన ఇండిగో విమానం 6E 6341 లో ఈ ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..


ఢిల్లీ నుంచి చెన్నైకు వెళ్తున్న ఇండిగో విమానం మరి కొద్ది సేపట్లో చెన్నైలో ల్యాండ్ అవుతుంది అనగా.. విమానంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ ను తెరిచేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కొందరు గట్టిగా కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. దాంతో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమాన సిబ్బంది అప్రమత్తతతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 


ఇండిగో విమానం చెన్నై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవగానే.. ఎమర్జెన్సీ డోర్ ను తెరిచేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని విమాన సిబ్బంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధికారులకు అప్పగించారు. సదరు ప్రయాణికుడిని మణికందన్ గా అధికారులు గుర్తించారు. అతడిపై ఇండిగో సిబ్బంది ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.