Delimitation Bill Special Majority: దేశవ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనకు ‘డీలిమిటేషన్ బిల్లు 2026’కు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ప్రకారం ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలోని లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచడంతో పాటు, 2051 వరకు రాష్ట్రాల మధ్య ప్రస్తుత సీట్ల నిష్పత్తిని యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు.  అయితే, ఈ మార్పులన్నీ అమలు కావాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందడం తప్పనిసరి. సాధారణ బిల్లుల మాదిరిగా దీనిని వాయిస్ ఓటు   ద్వారా ఆమోదించే అవకాశం లేదు. ఈ బిల్లు ఆమోదం అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది.

Continues below advertisement

రాజ్యాంగ సవరణకు స్పెషల్ మెజారిటీ 

లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు పెంచాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం, రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే రెండు కీలక షరతులు ఉన్నాయి. సభలోని మొత్తం సభ్యులలో సాధారణ మెజారిటీ (50% కంటే ఎక్కువ) మద్దతు ఉండాలి. సభకు హాజరై ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యులలో కనీసం మూడింట రెండు వంతుల (2/3) మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. ఈ రెండు నిబంధనలను లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ విడివిడిగా పాటించాలి.  

వాయిస్ ఓటు ఎందుకు సరిపోదు?

సాధారణ బిల్లుల విషయంలో ఎంపీలు తమ మద్దతును లేదా వ్యతిరేకతను  అవును లేదా కాదు అని మూజువాణి ఓటు పద్ధతిని అనుసరిస్తారు. ఇందులో ప్రతి ఎంపీ ఓటును విడివిడిగా లెక్కించరు. కానీ, రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో సభకు హాజరైన వారిలో కచ్చితంగా 2/3 వంతు మెజారిటీ లభించిందని అధికారికంగా నిరూపించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 368లో వాయిస్ ఓటును నేరుగా నిషేధించనప్పటికీ, లోక్‌సభ రూల్ 158 ప్రకారం ప్రత్యేక మెజారిటీ అవసరమయ్యే ప్రతిపాదనలపై తప్పనిసరిగా డివిజన్ ఆఫ్ ఓట్స్  నిర్వహించాలి. అంటే, ఎలక్ట్రానిక్ విధానం లేదా స్లిప్పుల ద్వారా ప్రతి ఎంపీ ఓటును విడివిడిగా లెక్కించి రికార్డు చేయాలి. అందువల్లే ఈ బిల్లును వాయిస్ ఓటుతో పాస్ చేయడం సాధ్యం కాదు. Also Read: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ

Continues below advertisement

ఏప్రిల్‌లో వీగిపోయిన బిల్లు  

స్పెషల్ మెజారిటీ రూల్ కారణంగానే ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందలేకపోయింది. ఓటింగ్‌లో మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొన్నారు. బిల్లు గట్టెక్కాలంటే మూడింట రెండొంతుల లెక్కన 352 ఓట్లు అవసరం కాగా, ప్రభుత్వానికి అనుకూలంగా 298 ఓట్లు మాత్రమే వచ్చాయి. 230 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో 54 ఓట్ల తేడాతో బిల్లు వీగిపోయింది.  

దక్షిణాది రాష్ట్రాల వాదన 

జనాభా ఆధారంగా సీట్ల పెంపు జరిగితే, జనాభా నియంత్రణను అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఆందోళన మొదటి నుంచీ ఉంది. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు భారీగా పెరిగి, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యత తగ్గుతుందన్న భయంతో విపక్షాలు గతంలో ఈ బిల్లును అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలోనే, అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెంచేలా సవరణలు చేస్తూ కేంద్రం ఇప్పుడు మరోసారి పార్లమెంటులో బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమైంది. Also Read: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా