Delhi Services Bill: 


రాష్ట్రపతి ఆమోద ముద్ర 


కేంద్రం ప్రతిపాదించిన ఢిల్లీ సర్వీస్ యాక్ట్‌ (Delhi Services Act) బిల్‌ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఫలితంగా...ఇది అధికారికంగా చట్టంగా మారిపోయింది. ఆగస్టు 1వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా National Capital Territory of Delhi  బిల్‌ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఢిల్లీలోని పాలనా వ్యవహారాలపై కేంద్రానికి అధికారాలు కల్పించే బిల్లు ఇది. ఆప్‌ సహా పలు పార్టీలు దీన్ని వ్యతిరేకించినప్పటికీ బిల్‌ ప్రవేశపెట్టారు షా. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పూర్తవడం వల్ల చట్టంగా మారిపోయింది. ఆగస్టు 7న రాజ్యసభలో ఈ బిల్ పాస్ అయింది. 132 ఓట్లు అనుకూలంగా రాగా...102 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. YSRCP,BJD పార్టీలు కేంద్రానికి అనుకూలంగా ఓటు వేశాయి.  ఈ బిల్లు ప్రజాస్వామ్య విధానానికే వ్యతిరేకం అని ఆప్ విమర్శించింది. పాలనా వ్యవహారాల్లో కేంద్రం జోక్యం ఉండకూడదని నిరసిస్తున్న ఆప్‌ వైఖరికి వ్యతిరేకంగా బిల్‌ తీసుకొచ్చింది కేంద్రం. ఢిల్లీలోని అధికారులను బదిలీ చేయాలన్నా, తొలగించాలన్నా అంతా కేంద్రం అధీనంలోనే ఉంటుంది. దీన్ని చాలా సందర్భాల్లో వ్యతిరేకించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. సీఎం పదవి ఉన్నా...అధికారులు తాము చెప్పినట్టుగా నడుచుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలోనే లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సక్సేనాతోనూ విభేదాలు వచ్చాయి. దీనిపై ఆప్ న్యాయపోరాటం కూడా చేసింది. విజయం సాధించింది. కానీ...ఉన్నట్టుండి కేంద్రం కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు తీర్పునీ పక్కన పెట్టింది.