Delhi Election Result 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యంతో బీజేపీ విజయం వైపు పయనిస్తోంది. ఆమ్​ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్​ ఓటమి అంచుల్లో ఉండడం గమనార్హం. న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న కేజ్రీవాల్​పై బీజేపీ నేత పర్వేశ్​ సాహిబ్​ సింగ్​ వర్మ ఆధిక్యం కనబరుస్తున్నారు. ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. పర్వేశ్​ వర్మ విజయం సాధించారని కౌంటింగ్​ కేంద్రాల వద్ద ఉన్న విలేకరులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఎవరీ పర్వేశ్ వర్మ అనే చర్చ మొదలైంది.

మాజీ సీఎం సాహిబ్ సింగ్ కుమారుడే పర్వేశ్ఢిల్లీ మాజీ సీఎం, బీజేపీ లీడర్​ సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేశ్ వర్మ. 1977లో జన్మించిన ఆయన ఢిల్లీ పబ్లిక్​ స్కూల్​లో స్కూలింగ్​, ఇంటర్​ చదివారు. బీఏ తర్వాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు. జాట్ వంశానికి చెందిన పర్వేశ్​ 2013లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే ఏడాది జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి మెహ్‌రౌలి నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గం నుంచి 2.80 లక్షల ఓట్ల మెజార్టీ సాధించి పార్టమెంట్​కి ఎంట్రీ ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఏకంగా 5.78 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా మాజీ సీఎం కేజ్రీవాల్​ను ఓడించడంతో ఆయన పేరు మారుమోగుతోంది. 

కేజ్రీవాల్​ను తొలగించండి.. దేశాన్ని కాపాడండిఎన్నికల్లో పర్వేశ్​ వర్మ తనదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్లారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కూడా అందించడం లేదని, సమస్యలు పరిష్కరించడంలేదని ఆమ్​ ఆద్మీ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్​పై నిప్పులు చెరిగారు. ‘కేజ్రీవాల్​ను తొలగించండి.. దేశాన్ని కాపాడండి’ అనే ఓ స్ట్రాంగ్​ స్లోగన్​తో ఓటర్ల దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలు పూర్తిగా విఫలమయ్యాయని, రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని, యమునా నదిని శుద్ధి చేసే పనిలోనూ చేతులెత్తేసిందని విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఆయన లేవనెత్తిన ఈ అంశాలు ఓటర్ల దృష్టికి ఆకర్షించాయి. పర్వేశ్​ వర్మ మామ కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ఆయన మామ ఆజాద్​ సింగ్​ నార్త్​ ఢిల్లీ మున్సిపల్​ కార్పొరేషన్​ మేయర్​గా పనిచేస్తున్నారు. 

ఆతిశీ ఒక్కరే..మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ కూడా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో కేజ్రీవాల్​ ఓటు బ్యాంకు చీలినట్లు తెలుస్తోంది. ఇక ఆప్​ ప్రధాన మనీశ్ సిసోడియా బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో ఓటమి చవిచూశారు. మరికొందరు ముఖ్య నేతలు సైతం ఓటమి అంచుల్లో ఉన్నారు. సీఎం ఆతిషీ ఆధిక్యం ఒక్కటే ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశం. కాల్​కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆతిషీపై బీజేపీ అభ్యర్థి రమేశ్​ బిధూరిపై ఆధిక్య కనబరుస్తున్నారు.

చతికిలబడ్డ కాంగ్రెస్​ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలబడిపోయింది. ఒక్క స్థానంలో కూడా ప్రభావం చూపించలేకపోయింది. ఢిల్లీ ఎన్నికల్లో వరసగా మూడోసారి ఘెర పరాభవం చవిచూసి చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.